ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీ-4 విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వండి: సీఎం చంద్రబాబు - CM CHANDRABABU ON P4 POLICY

జీరో పావర్టీ-పీ-4 విధానపత్రంలో సీఎం చంద్రబాబు సందేశం - ఉన్నత స్థానాలకు చేరినవారు పేదలకు అండగా నిలవాలి

Chandrababu on P4 policy
Chandrababu on P4 policy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2025, 6:58 PM IST

Updated : Jan 12, 2025, 8:51 PM IST

Chandrababu on P-4 Policy : ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమాజంలో అత్యున్నత శిఖరాలకు చేరిన 10 శాతం మంది ప్రజలు అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనిచ్చి పైకి తేవాలని పిలుపునిచ్చారు. పేదల జీవితాలు మార్చేందుకు ఉద్దేశించిన పీ-4 విధాన పత్రాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఇందులో అందరూ పాలుపంచుకునేలా సంక్రాంతి రోజు సంకల్పం తీసుకోవాలని కోరారు.

ఆర్థిక అసమానతలు తొలగిపోయి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రతిపాదించిన పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్ ​షిప్-పీ-4 విధానంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పీ-4 విధానపత్రాన్ని ఎక్స్‌లో విడుదల చేసిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రజలకు రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు.

ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. 1995లో తెచ్చిన పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్-పీ-3 విధానంతో ఉపాధి కల్పన, సంపద సృష్టి జరిగిందని గుర్తుచేశారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లు సైతం నాటి అవకాశాలతో దేశ, విదేశాల్లో మంచి స్థానాల్లో ఉన్నారని తెలిపారు. అత్యధిక తలసరి ఆదాయం సాధించి తెలుగు ప్రజల సత్తా చాటుతున్నారని, నాటి సంస్కరణ ఫలాలు అన్ని వర్గాలకు చేర్చాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Chandrababu Tweet on P4 policy: రాష్ట్రంలో ఇప్పటికి లక్షల కుటుంబాలు పేదరికంలోనే ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. విద్య, వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు వంటి కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితిలో ఉన్నారని విచారం వెలిబుచ్చారు. ఎవరు ఎక్కడ స్థిరపడినా వారి మాతృ భూమిలో ఒక వ్యక్తికో, ఓ కుటుంబానికో, సమూహానికో, గ్రామానికో, ప్రాంతానికో చేయూత అందించి వారి జీవన ప్రమాణాలు పెంచవచ్చునని తెలిపారు. సమాజంలో లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని అగ్రస్థానాల్లో ఉన్నవారు సమాజానికి తమవంతు తిరిగి ఇచ్చే ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఉన్నత స్థానాల్లోని వ్యక్తులు, ఎన్ఆర్ఐలు తమకు తెలిసిన పేదలకు అండగా ఉంటూ అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో పెనుమార్పులు తీసుకురావచ్చని చంద్రబాబు వివరించారు. గతంలో జన్మభూమి స్ఫూర్తితో చేపట్టిన కార్యక్రమాలు గ్రామాల్లో అద్భుత ఫలితాలను ఇచ్చాయని గుర్తుచేశారు. నేడూ అదే స్ఫూర్తితో అట్టడుగున ఉన్న పేదలను పైకి తెచ్చేందుకు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.

సాయం చేస్తేనే విజయాలకు సార్థకత:ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తోడైతేనే ప్రగతికి ప్రతిబంధకంగా ఉన్న పేదరికాన్ని రూపుమాపాలనే లక్ష్యం నెరవేరుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలతోపాటు పండగకు సొంతూళ్లకు వచ్చిన ప్రతి ఒక్కరూ దీనిపై ఆలోచించాలన్నారు. పొరుగువారికి సాయం చేయడం ద్వారానే ఆయా వ్యక్తుల విజయాలకు సార్థకత చేకూరుతుందని చెప్పారు. పీ-4 విధానంపై ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకొచ్చి 30 రోజుల పాటు సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

స్వర్ణ కుప్పం- విజన్ 2029! డాక్యుమెంట్ రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు

పెట్టుబడి కంటే ఐడియా ముఖ్యం - తెలుగువాళ్లు ఉన్నత స్థానాలకు ఎదగాలి: చంద్రబాబు

Last Updated : Jan 12, 2025, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details