CM Chandrababu on Swarnandhra 2047 :రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పారు. భద్రత లేకుంటే రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారని అన్నారు. శాసనసభలో 'స్వర్ణాంధ్రప్రదేశ్-2047' డాక్యుమెంట్‌పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్' నినాదంతో దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.
పేదరిక నిర్మూలనకు చర్యలు :స్వర్ణాంధ్రప్రదేశ్-2047 కోసం పది సూత్రాలతో విజన్ రూపొందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆయన సభలో ప్రవేశపెట్టారు. పది సూత్రాలపైనే ఎకానమీ, సర్వీసెస్, భవిష్యత్తు ఆధారపడుతుందన్న సీఎం పేదరిక నిర్మూలన, సమ్మిళిత వృద్ధిరేటు, ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, మానవ వనరుల వృద్ధి, నీటి వనరుల వృద్ధితో పాటు అగ్రి టెక్, ఉత్తమ లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. డీప్ టెక్, స్వచ్ఛ్ ఆంధ్ర, ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టామన్న సీఎం నిర్దిష్ట కాలపరిమితిలో పేదరిక నిర్మూలనకు చర్యలు చేపడతామని చెప్పారు.
సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ భేటీ - స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌పై చర్చ
ఎమ్మెల్యేలకు సూచనలు : 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. మనం స్వర్ణాంధ్ర-2047 నినాదంతో ముందుకెళ్లాలని అన్నారు. ఎమ్మెల్యేలపై బాధ్యత ఉందని, నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు. 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపర్చాలని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తే ఏ నియోజకవర్గమైనా గెలిపిస్తారని చంద్రబాబు తెలిపారు.