Chandrababu on Delhi Elections :సమ్మిళిత వృద్ధితోనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు వివరించారు. ఎవరికి ఓట్లు వేస్తే డెవలప్మెంట్ జరుగుతుందో ఆలోచించాలన్నారు. దిల్లీలో వాతావరణ కాలుష్యంతోపాటు రాజకీయ కాలుష్యం కూడా ఉందని చెప్పారు. అభివృద్ధికి దేశ రాజధాని ఆమడదూరంలో ఆగిపోయిందని సమస్యల వలయంలో చిక్కుకుందని తెలిపారు. డెవలప్మెంట్ కావాలంటే బీజేపీకి ఓట్లు వేయాలని కోరారు. హస్తినలో కమలం గెలుపు దేశ ప్రగతికి మలుపని అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని సీఎం తెలిపారు. 2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మార్మోగుతోందని అన్నారు. ఏఐ సాంకేతికతలో దేశం ప్రముఖ పాత్ర వహించనుందని పేర్కొన్నారు. గతంలో ఐటీపై ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి పెరిగిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. పన్ను సంస్కరణల్లో చాలా మార్పులు జరిగినట్లు తెలియజేశారు. ఎంఎస్‌ఎంఈ పాలసీ గేమ్‌ఛేంజర్‌గా మారబోతోందని ఆయన స్పష్టం చేశారు.
"ఇప్పుడు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్ విధానమే. భారత్‌లో పెట్టుబడులకు చాలామంది ముందుకొస్తున్నారు. పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి. నూతన ఆవిష్కరణలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పన పెరుగుతోంది. వృద్ధిరేటు పెంచేలా ఈ బడ్జెట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యవేత్తల్లో భారతీయులే ప్రముఖంగా ఉంటున్నారు." - చంద్రబాబు, ముఖ్యమంత్రి