CM Chandrababu Naidu On Atchutapuram SEZ Accident :అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా కంపెనీని ఆయన పరిశీలించారు. అనతరం ఈ ఘటనపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. తర్వతా ఆయన మీడియాతో మాట్లాడారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలు, గాయపడిన వారికి రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అచ్యుతాపురం సెజ్ కంపెనీ పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించలేదని, పరిశ్రమలో శక్తివంతమైన పేలుడు జరిగిందని తెలిపారు.
గత ఐదు సంవత్సరాల్లో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి :పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, కానీ ఇక్కడ నిబంధనల మేరకు ఎస్‌వోపీ అనుసరించలేదని తెలుస్తోందని చంద్రబాబు తెలిపారు. పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదన్నారు. ఈ సెజ్ లో గత ఐదు సంవత్సరాల్లో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి చెందారని తెలిపారు. పరిశ్రమల్లో వెంటనే అంతర్గత విచారణ చేపట్టాలని, రెడ్ కేటగిరిలోని పరిశ్రమలన్నీ కచ్చితంగా ఎస్‌వోపీని పాటించాలని స్పష్టం చేశారు.
కంపెనీ నుంచే పరిహారం ఇప్పిస్తాం :ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నామని, పరిశ్రమలో ఏం జరిగింది. లోపాలపై కమిటీ విచారిస్తుందని వెల్లడించారు. నివేదిక వచ్చాక ఎవరు తప్పుచేసినా వదిలిపెట్టమని, శిక్షిస్తామని, బాధిత కుటుంబాలు, క్షతగాత్రులకు పరిహారం కంపెనీ నుంచే ఇప్పిస్తున్నామని అన్నారు. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు చేపడతామని తెలిపారు.