CM Chandrababu in Flood Affected Areas Visit: వరద ముంపునకు గురైన విజయవాడలో తొలి రోజు ప్రజల కళ్లలో బాధ కనిపిస్తే, తొమ్మిదో రోజు ప్రభుత్వంపై వారిలో నమ్మకం కనిపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వరద బాధితులకు ఆర్థికసాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారంలో ఇన్సూరెన్స్ క్లయిం అందేలా చూస్తామని, మెకానిక్‌లను తీసుకొచ్చి వాహనాలు రిపేర్ చేయిస్తామని స్పష్టంచేశారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు వరుసగా తొమ్మిదోరోజూ పర్యటించారు. భవానీపురం, సితారరోడ్డు, ఊర్మిళానగర్, కబేళా సెంటర్లలో బాధితుల్ని పరామర్శిచారు. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ మీదుగా చిట్టినగర్, అజిత్‌సింగ్‌నగర్ వెళ్లారు. వరద తీవ్రత తగ్గడంతో కారులోనే వెళ్లారు.
ప్రతిచోటా ప్రజలతో మాట్లాడి సహాయకచర్యల గురించి ఆరా తీశారు. డ్రైనేజీ క్లీనింగ్ పనుల్ని పరిశీలించారు. కబేళా సెంటర్‌లో పలువురు మహిళలు తమకు ఉపాధి చూపించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. గత తొమ్మిది రోజులుగా ప్రజలు వరదనీళ్లలో ఉన్నారని, వారి కష్టాలు వర్ణనాతీతమన్నారు. వారు తమ సర్వస్వాన్ని కోల్పొయారని, ఇంట్లో ఏమీ లేకుండా కట్టుబట్టలతో బయటకొచ్చారని తెలిపారు. వారికి కొంత ఆర్థిక సాయం చేస్తే తప్ప కోలుకొనే పరిస్థితి లేదని, అందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. పరిస్థితుల్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి అన్నిచర్యలూ తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
ఇంట్లో పాడైన వస్తువుల్ని బాగుచేసుకోడానికి అర్బన్ కంపెనీ సహాయం తీసుకుంటామని, ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, టెక్నీషియన్‌లను బుక్‌చేసుకోవడంలో ఇబ్బందులు లేకుండా సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను వినియోగిస్తామని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో చివరి వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటానని, ప్రజలు వీటికి స్పందించాలని కోరారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేశ్‌లు బుడమేరుకు గండ్లు పూడ్చే ప్రక్రియను పర్యవేక్షించారని ప్రశంసించారు.