CM Chandrababu Met Tata Group Chairman Chandrasekaran :పర్యాటకం, పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తూ రాష్ట్రంలో మరో తాజ్, వివాంతా, గేట్ వే, సెలెక్టియన్స్, జింజర్ లాంటి 20 హోటల్స్ ఏర్పాటుకు టాటా సంస్థలకు చెందిన ఇండియన్ హోటల్స్ ముందుకు వచ్చింది. విశాఖలో కొత్తగా ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని టాటా కంపెనీల ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో టాటా గ్రూపు ఒక ముఖ్య వాటాదారుగా కొనసాగతుందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ తొలి భేటీలో పాల్గొన్న సీఎం భవిష్యత్తులో 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తెలిపారు.
దేశ పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర :టాటా కంపెనీల ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. చంద్రశేఖరన్‌తో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు వెల్లడించారు. రతన్ టాటా దార్శనిక నాయకత్వం, సహకారం దేశ పారిశ్రామిక ముఖచిత్రంపై చెరగని ముద్ర వేశాయని కొనియడారు. ఏపీ అభివృద్ధిలోనూ ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు.
ఒక కుటుంబం -ఒక పారిశ్రామికవేత్త : విశాఖలో కొత్తగా ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు టీసీఎస్ కట్టుబడి ఉందన్న ఆయన 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చంద్రశేఖరన్ చెప్పినట్లు తెలిపారు. టాటా పవర్ 5 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా 40 వేల కోట్లు పెట్టుబడులు పెడుతోందన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం డీప్ టెక్, కృత్రిమ మేధ వినియోగించి పరిష్కారాలను కనుగొనే విషయంలో సహకారంపై చర్చ జరిగినట్లు వెల్లడించారు. "ఒక కుటుంబం -ఒక పారిశ్రామికవేత్త" అని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేస్తుందన్నారు. అట్టడుగు వర్గాల సాధికారతను విశ్వసించిన రతన్ టాటాకు అశ్రునివాళి అర్పిస్తున్నామన్నారు
ఏపీలో టాటాపవర్ రూ.40 వేల కోట్ల పెట్టుబడి - టాటా గ్రూప్ ఛైర్మన్‌తో సీఎం భేటీ
పేద ప్రజల జీవనప్రమాణాల పెంపు :ఆ తర్వాత జరిగిన స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ తొలి భేటీలో టాటా సంస్థల ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, జీఎంఆర్ (GMR) గ్రూప్ ఛైర్మన్ జీఎం రావు, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రమణ్యన్, టీవీఎస్ కంపెనీ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్, అపోలో ప్రతినిధి ప్రీతారెడ్డి, పిరమల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పిరమల్, రెడ్డీ లేబొరేటరీస్ ఛైర్మన్ సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. కమిటీలో సభ్యులుగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం మేధోమథనం చేశారు. అవకాశాల కల్పనతో సంపద సృష్టించడం సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. దాన్ని పేద వర్గాలకు పంచి ప్రజల జీవనప్రమాణాలను పెంచొచ్చని అభిప్రాయపడ్డారు.