CM Chandrababu Field Visit to Flood Affected Areas:వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై వెళ్లి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో సీఎం చర్చించారు. దెబ్బతిన్న పంటలు వివరాలను సీఎం చంద్రబాబు స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి వద్ద బుడమేరు కాలువపై వరద ఉద్ధృతిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. వరద పరిస్థితిపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. విజయవాడకు ఇటువంటి విపత్తు మళ్లీ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. బుడమేరులో వరద తగ్గిందని అధికారులు బాధ్యతగా పని చేయాలని సూచించారు. బుడమేరు కాలువ ప్రక్షాళన చేపడతామని తెలిపారు.
గతంలో బుడమేరు ఆధునికీకరణ కోసం నిధులు కూడా కేటాయించడం జరిగిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ తరువాత విజయవాడ మధురనగర్ బ్రిడ్జి వద్ద ముంపు ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. పలువురు స్థానికులతో మాట్లాడి ప్రభుత్వ సహాయక చర్యలు అందుతున్న తీరును స్వయంగా ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద నష్టం పరిశీలనకు వచ్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిశారు. విజయవాడ కలెక్టరేట్లో వరద నష్టం ఫొటో ఎగ్జిబిషన్‌ను శివరాజ్‌కు చంద్రబాబు చూపించారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.