Clashes in Andhra Pradesh Elections: ఎన్నికల ముందు వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారనే కక్షతో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన దళిత యువకుడు కత్తి రాజేష్‌పై వైఎస్సార్సీపీ బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే కోన రఘుపతి బంధువు, కర్లపాలెం మండలం వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జి, సినీ రచయిత కోన వెంకట్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. కర్లపాలెం పోలీసుస్టేషన్లో శనివారం ఎస్సై జనార్దన్ సమక్షంలోనే వారు దాడికి పాల్పడ్డారు.
గణపరానికి చెందిన వైఎస్సార్సీపీ ఎస్సీ నాయకుడు కత్తి రాజేష్ తన అనుచరులతో కలిసి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మ సమక్షంలో శనివారం ఉదయం పార్టీలో చేరారు. రాజేష్ తమ వద్ద రూ.8 లక్షలకు పైగా డబ్బు తీసుకుని ఇప్పుడు టీడీపీలో చేరారని కర్లపాలెం పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాజేష్‌ను పోలీసు సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
ఎస్సై ఛాంబర్‌లో ఎస్సై జనార్దన్ సమక్షంలో రాజేష్‌పై కోన వెంకట్, వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారు. ఎస్సై జనార్దన్ కూడా యువకుడిని కొట్టారు. ఈ విషయం తెలిసి టీడీపీ లోక్‌సభ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్, అసెంబ్లీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి కర్లపాలెం చేరుకున్నారు.
కత్తులు, గునపాలతో దాడులు చేసుకున్న టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు - tdp ysrcp activists clash
యువకుడి కుటుంబసభ్యులు, గణపవరం ఎస్సీ కాలనీ వాసులు పోలీస్‌స్టేషన్ వద్ద కోన రఘుపతి, కోన వెంకట్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తనపై జరిగిన దాడిపై రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ ఎదుట టీడీపీ శ్రేణులు, బంధువులు, ఎస్సీ కాలనీ వాసులతో కలిసి రహదారిపై బైఠాయించి రాజేష్ ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కోన వెంకట్‌పై ఎట్రాసిటీ కేసు:రాజేష్‌పై దాడి చేసిన కోన వెంకట్, మార్పు బెనర్జీ, మార్పు రత్నం, కాగిత మోజెస్, ఉపాధ్యాయుడు నక్కా సంతోష్, ఎస్సై జనార్దన్‌లపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. రాజేష్‌పై పోలీస్ స్టేషన్లోనే ఎస్సై సమక్షంలోనే వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేయటానికి సంబంధించి ఎస్సై జనార్దన్‌పై డీఎస్పీ ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఎస్పీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్సై జనార్దన్‌ను ఎస్పీ వకుల్ జిందాల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 46,389 కేంద్రాలు, 4.14 కోట్ల ఓటర్లు - ప్రశాంత పోలింగ్‌పై ఈసీ నజర్ - AP ELECTIONS 2024
బండ రాళ్లు,పెద్దపెద్ద కర్రలతోదాడి: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా కారుపై దాడి చేశారు. బండ రాళ్లు, పెద్దపెద్ద కర్రలతో దాడి చేయగా, ఈ దాడిలో కారు ధ్వంసం కాగా ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కంచల గ్రామం టీడీపీకి అనుకూలంగా ఉండటంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తల నివాసాల ముందుకు నిన్న రాత్రి వెళ్లి పెద్దపెద్దగా కాకలు వేస్తూ బయటకు పిలిచి దాడి చేశారు. అనంతరం నందిగామ పోలీస్ స్టేషన్లో తెలియజేసినందుకు తెలుగుదేశం కార్యకర్తలు ఐదుగురు కారులో బయలుదేరారు. ఈ సమయంలో కారుపై బండ రాళ్లు వేశారు, పెద్ద పెద్ద కర్రలతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని నందిగామ పోలీస్ స్టేషన్‌కు వచ్చి టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు కాగా నందిగాం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం జువ్వలపాళెం గ్రామంలో రాత్రి టీడీపీ మద్దతుదారు, న్యాయవాది గాడి తిలక్ బాబు కారును వైఎస్సార్సీపీ అల్లరి మూకలు దహనం చేశారు. ఈయన ఇటీవల టీడీపీలో చేరారు. దీంతో రాత్రి సమయంలో కారును ఇంటి ముందు నిలిపి ఉండగా దానిని వైఎస్సార్సీపీ మూకలు తగులబెట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారు వేణురెడ్డి పోలింగ్ ఏజెంట్‌గా ఉండేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేసి అతనిని గాయపరిచారు. ఏజెంట్‌గా ఉండేందుకు వీల్లదని బెదిరించారు.
ఒక్కో నియోజకవర్గానికి రూ. 70 కోట్లు - ఎంత ఖర్చైనా కొనడమే ! - Costliest Elections
తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై కత్తితో దాడి:తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న ఆ పార్టీ కార్యకర్తపై మద్దిబోయిన నాగార్జునపై వైఎస్సార్సీపీ నేతలు కత్తితో దాడి చేశారని తెలుగుదేశం పార్టీ నేత మరక శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఘటన బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతయపాలెంలో జరిగింది. వైఎస్సార్సీపీ నేతలు శనివారం రాత్రి తన ఇంటికి వచ్చి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తే మీ అంతు తేలుస్తాం అంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఆ సమయంలో నాగార్జునపై కత్తితో దాడికి పాల్పడ్డారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల ప్రచారంలో వైసీపీ-టీడీపీ వర్గీయుల ఘర్షణ- ఎమ్మెల్యే సతీమణికి గాయాలు - Clash Between TDP and YCP