Chinkara Deer in Lankamala Forest :అందాల కొండలు, కోనలూ, జలపాతాలూ. చరిత్రాసక్తి ఉన్నవారి కోసం రాతియుగం నాటి రేఖాచిత్రాలూ, రాయలనాటి నిర్మాణాలూ. భక్తుల కోసం మార్మికతలెన్నో ఇముడ్చుకున్న దేవాలయాలు. పక్షి ప్రేమికుల కోసం ఆరుదైన విహంగాలు. ఇన్ని ప్రత్యేకతలున్న చూడచక్కని ప్రదేశమే లంకమల! ఓ అరుదైన అటవీ పర్యటక ప్రాంతమిది. తిరుపతి చుట్టుపక్కలున్న కొండల్ని శేషాచలం అడవులంటారు. ఆ అడవులు వైఎస్సార్ కడపజిల్లా సిద్ధవటం దగ్గర పెన్నా నది వరకూ విస్తరించి ఉంటాయి.
ఈ నదికి దక్షిణం అంచున- సిద్ధవటం నుంచి మొదలవుతాయి లంకమల అడవులు. సుమారు 800 చదరపు కిలోమీటర్లలో బద్వేలుదాకా విస్తరించి ఉంటాయి. అక్కడి నుంచి నల్లమల ప్రారంభమవుతుంది. అలా ఓ వైపు శేషాచలం అరణ్యం, మరోవైపు నల్లమల అడవులు వీటి మధ్య త్రికోణాకృతిలో ఉంటాయి లంకమల అభయారణ్యం.
తాజాగా లంకమల అభయారణ్యం సిద్దవటం రేంజి అటవీ ప్రాంతంలో జింక జాతుల్లో అరుదైన చింకారా(ఇండియన్ గజల్)ను అటవీ అధికారులు గుర్తించారు. ఇక్కడి అటవీ ప్రాంతాల్లోని అరుదైన కలివికోడి ఆచూకీ కోసం అధికారులు డిజిటల్ సాంకేతిక కెమెరాలు అమర్చారు. దాని కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దవటం రేంజి కొండూరు బీటు మచ్ఛాయకుంట అటవీ ప్రాంతంలో అమర్చిన కెమెరాల్లో నిక్షిప్తమైన చిత్రాలను అధికారులు ఇటీవల పరిశీలించారు. వాటిలో అరుదైన చింకారా జింక కనిపించింది.