Smartphones Effect on Kids : డిజిటల్ ఉపకరణాల వినియోగం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. ఎలక్ట్రానిక్ తెరలను ఎక్కువగా చూస్తుండటంతో చిన్నారుల్లో కంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అలాగే మానసిక సమస్యతో చదువులో వెనుకబడిపోతున్నారు.
విద్యార్థుల్లో కంటి సమస్యలు : ఏలూరు జిల్లా నూజివీడులో ఓ విద్యార్థి స్మార్ట్ ఫోన్ అధికంగా వినియోగించడంతో చివరికి కంటి చూపు మందగించింది. మరో బాలుడు ఇటీవల తండ్రి చరవాణిలో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ బ్యాంకు ఖాతాలోని రూ.70 వేలు పోగొట్టాడు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 5,860 మంది విద్యార్థుల్లో కంటి సమస్యలున్నట్లుగా రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమ్ వైద్యుల పరీక్షల్లో తెలింది. ఇందులో 50 శాతానికిపైగా స్మార్ట్ ఫోన్లులే కారణమని వైద్యులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియాలో నిషేధం : పదహారేళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో పిల్లల భద్రత గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల కోసం ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని స్వయంగా ప్రధానే అన్నారంటే అక్కడ పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
సృజనాత్మకత లోపం : మైదానంలో ఉల్లాసంగా ఆడుకోవాల్సిన పిల్లలు స్మార్ట్ ఫోన్లలో బందీ మారుతున్నారు. స్కూల్లో ప్రాజెక్టు వర్క్స్ ఇచ్చినా చివరికీ గూగుల్‌పై ఆధారపడుతున్నారు. దీంతో సృజనాత్మకతను కోల్పోవడంతో పాటు వివిధ రకాల రుగ్మతలకు లోనవుతున్నారు. దేశవ్యాప్తంగా 14-16 సంవత్సరాల మధ్య వారిలో 82 శాతం మంది చరవాణీలు వినియోగిస్తున్నట్లుగా వార్షిక విద్యా స్థాయి నివేదిక తాజా అధ్యయనంలో పేర్కొంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 4,94,255 మంది విద్యార్థులుంటే వీరిలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 95 శాతం గృహాల్లో స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. వీరిలో స్మార్ట్ ఫోన్లు అధిక శాతం వినియోగిస్తోంది విద్యార్థులేనని తెలుస్తోంది.