Peddapuli In Andhra Pradesh : ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 2 రోజుల క్రితం మేత కోసం వెళ్లిన ఆవుపై పెద్దపులి దాడిచేసి చంపింది. మృతి చెందిన ఆవు విలువ సుమారు 80,000/- రూపాయలు ఉంటుందని యజమాని తెలిపారు. పెద్దపులి కదలికలను కనిపెట్టేందుకు అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
చిరుత దాడిలో ఆవుదూడ మృతి: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లిలో చిరుత దాడిలో ఆవుదూడ మృతి చెందింది. మృతిచెందిన ఆవుదూడ విలువ సుమారు 30,000/- రూపాయల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్తున్నామని రైతులు తెలిపారు.