Chandrababu Phone to DGP Harish Kumar Gupta :తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వారి ఆస్తులపై వైఎస్సార్సీపీ వరుస దాడులు, విధ్వంసాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై డీజీపీతో ఆయన మాట్లాడారు. పోలింగ్ అనంతరం ప్రణాళికా బద్దంగా మాచర్లలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి దాడులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు. మాచర్లలో వందల మంది ప్రైవేటు సైన్యంతో జరుగుతున్న దాడులను అరికట్టడానికి అదనపు బలగాలను పంపాలని కోరారు. అన్ని గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని, దాడులకు పాల్పడతున్న వారిని అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనేక జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడులను ప్రస్తావించి లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపారు : తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైఎస్సార్సీపీ మూక దాడిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజమని అపజయం తప్పదనే సంకేతాలతో వైసీపీ తన ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపిందని మండిపడ్డారు. "పద్మావతి మహిళ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైసీపీ మూక దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. నాని అన్నతో మాట్లాడాను. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించాను. పోలీసులు వైసీపీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను" అని లోకేశ్ ట్విటర్ (X)లో పోస్టు పెట్టారు.