Chandrababu Ended Curtain Rule his Took Charge as CM : సీఎం అంటే ఒక అతీత శక్తి, ఎవరికీ కలిసేందుకు అవకాశం ఉండేది కాదు. జగన్ హయాంలో ఇలా ఉండేది పరిస్థితి. సీఎంగా బాధ్యతలు చేపట్టి ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే దాన్ని చంద్రబాబు మార్చేశారు. పరదాల పాలనకు స్వస్తి పలికి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ సచివాలయానికి వెళ్లారు. అక్కడ ఉద్యోగులతో సరదాగా మాట్లాడారు. తర్వాత కాన్వాయ్ ఆపి మరీ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.
గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ హయాంలో సీఎం ఎక్కడికెళ్లినా బారికేడ్లు రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనదారులను ఇబ్బంది పెట్టేవారు. దుకాణాలు మూయించి చిరువ్యాపారుల పొట్టకొట్టేవారు. జగన్ సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే సమయంలోనూ బారికేడ్లు పెట్టి, వందలాది మంది పోలీసులు మొహరించి వలలు పట్టుకునేవారు. రాజధాని రైతుల నిరసన సీఎంకు కనపడకుండా ఉండేందుకు పరదాలు కట్టేవారు. ఈ సంప్రదాయాలన్నింటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వస్తి పలికారు. రాజధాని రైతులు, ప్రజల మధ్య ఓపెన్ టాప్ ల్యాండ్ క్రూజర్ కారులో ఉండవల్లి నుంచి సచివాలయానికి పర్యటించారు. ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వచ్చాం, వారి బాధలు తెలుసుకోవడమే తమ కర్తవ్యమని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై బారికేడ్లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పెద్దాయన వచ్చారు, పండుగ తెచ్చారు- సీఎం చంద్రబాబుకు రైతుల ఘనస్వాగతం - Farmers Grand Welcome to CBN
మాజీ సీఎం జగన్ సచివాలయానికి రాకుండా క్యాంపు కార్యాలయం నుంచి ఐదేళ్లు పాలన సాగించారు. ఉద్యోగులు కలిసేందుకు సరిగా సమయం సైతం ఇవ్వలేదు. దీంతో ఐదేళ్లుగా సచివాలయం వెలవెలబోయేది. ఇప్పడు చంద్రబాబు రాకతో సచివాలయం ప్రాంగణమంతా కళకళలాడింది. మందడం నుంచి సచివాలయం వరకు దారి పొడవునా ఉద్యోగ సంఘాల నాయకులు నాపా ప్రసాద్, రామకృష్ణ, మురళీకృష్ణ భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఉద్యోగులు బారులు తీరారు.