Andhra Pradesh Election Counting Votes on June 4th :రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరినీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ధన్యవాదాలు తెలిపారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఏడు విడతల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నేటితో ముగియడంతో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీల కృషికి ప్రశంసలను తెలియజేస్తూ లేఖ రాశారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు అనే క్లిష్టమైన దశకు ఎన్నికల ప్రక్రియ చేరుకున్న నేపథ్యంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. తీవ్రమైన పోటీ కారణంగా భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని, ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజున తరువాత అత్యంత శ్రద్ధతో శాంతిభద్రతల పరిస్థితిని నిర్వహించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు.
కౌంటింగ్ ప్రక్రియను సవాల్‌గా తీసుకున్నాం : కృష్ణా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఓట్ల లెక్కింపులో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి హెచ్చరించారు. కౌంటింగ్ మూసే వరకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంటుందని అన్నారు. కౌంటింగ్ వేళ చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దంకి ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పల్నాడు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను సవాల్‌గా తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ చెప్పారు. కౌంటింగ్ రోజు ఒక్కకేసు నమోదైనా రౌడీషీట్ పెట్టడంలో వెనుకాడబోమని హెచ్చరించారు.