Central Team Visit Flood Affected Areas in Andhra Pradesh: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రానికి కలిగిన అపార నష్టంపై కేంద్రానికి వివరిస్తామని కేంద్ర బృందం తెలిపింది. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన బృందం ప్రస్తుత పరిస్థితుల్ని పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన సహాయ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకుంది. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ పంపిన ప్రత్యేక బృందం పర్యటించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు వచ్చిన హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం ముందుగా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వరదలతో ఎంత మేర నష్టం వాటిల్లింది..? ఎక్కడ ఎంత మేర జరిగిందనేది..? అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా వివరించారు.
వరద నష్టంపై రంగంలోకి దిగిన కేంద్ర బృందాలు - Central Team Visit in AP
వరదలతో విజయవాడలోనే 2 లక్షల 70 వేల మంది సహా రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల 70 వేల మంది ప్రభావితులయ్యారని తెలిపారు. సుమారు 4 వేల కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయని వివరించారు. కృష్ణా నదికి గతంలో ఎన్నడూ లేనంత వరద రావడంతోనే నగరాన్ని వరద ముంచెత్తిందని కేంద్రం బృందం దృష్టికి తీసుకెళ్లారు. ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం పరిశీలించింది. కృష్ణా నదిలో వరద ఉద్ధృతి, కొట్టుకొచ్చిన బోట్ల వల్ల జరిగిన నష్టాన్ని జలవనరుల శాఖ అధికారులు బృందానికి వివరించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండంలం కొండపల్లి శాంతి నగర్- కవులూరు వద్ద బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లోనూ పర్యటించింది.