Central Govt Not Giving Permission To Start Services Of Red Cross Units : అత్యవసర సమయాల్లో పేదలకు తక్కువ ధరకే రక్తం అందిస్తూ అండగా నిలుస్తోంది రెడ్‌క్రాస్ సొసైటీ. ప్రజలకు మెరుగైన సేవలందించేలా రక్కం కాంపొనెంట్ యూనిట్, సింగిల్ ప్లేట్ డోనర్ యూనిట్లను కూడా తేవాలని భావించింది. దాతల సహకారంతో అత్యాధునిక పరికరాలనూ సమకూర్చుకుంది. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా రెడ్ క్రాస్ పరిస్థితి తయారైంది. కేంద్రం నుంచి అనుమతులు రాక రక్తం యూనిట్లు ప్రారంభానికి నోచుకోలేదు. ఫలితంగా రెండేళ్లుగా ఆధునిక పరికరాలు గదులకే పరిమితమయ్యాయి.
అత్యాధునిక సేవలు అందించేందుకు శ్రీకారం : విజయనగరంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రోగికి అవసరమైన రక్తాన్ని ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నారు. అయితే కొన్నిసార్లు బ్లడ్ గ్రూపుల్లో తేడాలు వచ్చాయన్న ఆరోపణలున్నాయి. వీటిని సరిదిద్దేలా అత్యాధునిక సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో బ్లడ్ కాంపొనెంట్ యూనిట్, సింగిల్ ప్లేట్ డోనర్ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించింది. వీటి ద్వారా హోల్ బ్లడ్ తో పాటు ప్యాకెట్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్ లెట్లు, సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్లు వేర్వేరుగా అందించేందుకు కార్యాచరణ రూపొందించింది.
రెండేళ్లుగా నిరీక్షిస్తున్నా ఫలితం లేదు : రెండేళ్ల క్రితం దాతల సహకారంతో కోటి రూపాయల విలువైన పరికరాలను సమకూర్చుకుంది. కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ తనిఖీలు చేసి యంత్రపరికరాల నాణ్యత, తదితర అంశాలపైనా సంతృప్తి సైతం వ్యక్తం చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా రక్తం యూనిట్ల సేవలను ప్రారంభించేందుకు మాత్రం అనుమతులు రాలేదు. కేంద్ర అనుమతి కోసం రెండేళ్లుగా నిరీక్షిస్తున్నా ఫలితం లేదు. కోటి రూపాయల విలువైన పరికరాలు మూలనపడ్డాయి. వీలైనంత త్వరగా కేంద్రం రక్తం యూనిట్ల ప్రారంభానికి లైసెన్స్ ఇవ్వాలని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.