JEE Advanced 2025 :ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు పరీక్షను వరుసగా రెండు సంవత్సరాలు మాత్రమే రాసే అవకాశం ఉంది. కానీ ఇప్పటినుంచి మూడేళ్లు రాసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్ పాసైన వారికి కూడా ఈసారి ఈ పరీక్ష రాసేందుకు అర్హత లభించింది.
ఈ మేరకు అడ్వాన్స్‌డ్- 2025 నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ కాన్పుర్ ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించింది. 2000 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారు మాత్రమే 2025 అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల మినహాయింపు ఇచ్చింది. ఈ వర్గాల్లో 1995 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత పుట్టినవారు కూడా ఈ పరీక్షకు హాజరుకావొచ్చు. సిలబస్‌లో ఎటువంటి మార్పు లేదని ఐఐటీ కాన్పుర్ వివరించింది.
జేఈఈ మెయిన్‌లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. అడ్వాన్స్‌డ్-2025 పరీక్ష తేదీని ఐఐటీ కాన్పుర్ ఇంకా ప్రకటించలేదు. సాధారణంగా మే మూడు లేదా నాలుగో వారంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆ ప్రకారం ఈసారి మే 18 లేదా 25 తేదీల్లో జరగడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు.