Urban Forests in AP : ప్రకృతి అందాలు తిలకించేందుకు, అడవులను ప్రజలకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నగర వనాల అభివృద్ధికి 2023లో శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా వీటి అభివృద్ధి కోసం తొలి విడతగా రూ.15.4 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
11 City Forests in AP :ఈ నిధులతో కర్నూలులోని గార్గేయపురం, కడప, నెల్లిమర్లలోని వెలగాడ, చిత్తూరు డెయిరీ, కలిగిరికొండ, కైలాసగిరి, తాడేపల్లిగూడెంలోని ప్రకాశరావుపాలెం, పెనుకొండలోని శ్రీకృష్ణదేవరాయ కోట ఎకోపార్క్, కదిరిలోని బత్రేపల్లి వాటర్‌ఫాల్స్ ఎకోపార్క్, పలాసలోని కాశీబుగ్గ, విశాఖలోని ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్లలో నగర వనాలను అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన అటవీ శాఖ అధికారులతో చర్చించారు.
నగర వనాలకు సంబంధించిన పనులపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ప్రస్తుతం ఏపీలో 50 నగర వనాల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయనీ అధికారులు ఆయనకు తెలిపారు. రాబోయే 100 రోజుల్లో 30 నగర వనాల పనులు పూర్తి కావస్తాయని వారు వివరించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే అవకాశాలు వస్తున్నాయని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం సుమారు 50 శాతం ఉండాలని చెప్పారు. ఇందులో భాగంగా నగర వనాల అభివృద్ధిపై దృష్టిసారించాలని అధికారులకు సూచించారు.