Central and State Governments funds to Manyam Roads : ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పీవీటీజీ గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున నిధులు కేటాయించాయి. ప్రధానమంత్రి జన్‌మన్ పథకంలో భాగంగా అల్లూరి జిల్లాలోని 265.16 కి.మీ పొడవున 71 రహదారుల నిర్మాణం కోసం రూ.246.16 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటాగా రూ.146 కోట్లు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాగా రూ.100 కోట్లు ఖర్చుచేయనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.275 కోట్లను మంజూరు చేస్తే అందులో అల్లూరి జిల్లాలోని పీవీటీజీ గ్రామాల రహదారి కోసమే రూ.246 కోట్లు కేటాయించడం విశేషం.
పెద్ద ఎత్తున నిధులు : అరకు, అనంతగిరి, కొయ్యూరు, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, గూడెంకొత్తవీధి, చింతపల్లి, పెదబయలు మండలాల పరిధిలోని మారుమూల రహదారులను ఈ నిధులతో అభివృద్ధి చేయనున్నారు. ఈ రోడ్ల పనులన్నీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే మొదలు కావాల్సి ఉంది. ఈ రహదారుల నిర్మాణం పూర్తయిన తర్వాత అయిదేళ్ల పాటు నిర్వహించేందుకు మరో రూ.16.77 కోట్లు వెచ్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాన్ని డోలీరహితంగా మార్చుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే పెద్దఎత్తున రోడ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటుంది. ఇటీవలే పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.33 కోట్లతో ఆరు రోడ్ల నిర్మణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఆయా పనులన్నింటికీ ఇటీవలే టెండర్లు పిలిచి కార్యరూపంలోకి తీసుకొస్తున్నారు.