CBSE Internal Assessment Exam in AP : విద్యార్థులను పునాది స్థాయి నుంచి సన్నద్ధం చేయకుండా, ఉపాధ్యాయులకు కనీస శిక్షణ ఇవ్వకుండా గత వైఎస్సార్సీపీ సర్కార్ ప్రవేశపెట్టిన సీబీఎస్‌ఈ పరీక్షా విధానం ఫలితాలు తిరోగమన దిశలో కన్పిస్తున్నాయి. గతంలో నాటి ముఖ్యమంత్రి జగన్ హడావిడిగా అమల్లోకి తెచ్చిన ఈ విధానం పర్యవసానాలకు ఓ తరం విద్యార్థులు బలి కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
పరీక్షలు రాసిన 77,478 మంది :సీబీఎస్‌ఈ అమలవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల సామర్థ్యాలను అంచనా వేసేందుకు తాజాగా రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు అంతర్గత మదింపు పరీక్షలు నిర్వహించింది. ఇప్పటివరకు బోధించిన సిలబస్ నుంచి 50 బహుళైచ్ఛిక ప్రశ్నలకు 50 మార్కుల చొప్పున కేటాయించారు. దీన్నే 100మార్కులకు లెక్కకట్టారు. ఇందుకు 80,000ల ట్యాబ్‌లు ఉపయోగించారు. మొత్తం 77,478 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.
YSRCP Govt in CBSE Decision :వారిలో ఇంగ్లిషులో 59,518 (76.81 శాతం), గణితంలో 56,213 (72.55 శాతం), సామాన్య శాస్త్రంలో 49,410 (63.77 శాతం), సాంఘిక శాస్త్రంలో 48,766 (62.94 శాతం) మంది ఫెయిల్ అయ్యారు. ఏ సబ్జెక్టులోనూ కనీసం సగం మంది పాస్ కాలేదు. ఈ ఫలితాలను చూసి అధికారులు విస్మయానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం 1000 పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలోనే పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే తాజా మదింపు ఫలితాలే రేపు పబ్లిక్ పరీక్షల్లోనూ పునరావృతమైతే పరిస్థితి ఏంటని వారు విద్యాశాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో? : సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులకు 20 ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. ఇవి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు వేస్తారు. కాబట్టి విద్యార్థులందరికీ సుమారు 20 మార్కులు వేయొచ్చని, మరో 20 మార్కులు తెచ్చుకుంటే పాస్ అయిపోతారంటూ గత సర్కార్ ఆలోచించిందని అధికారులు ఇటీవల సమీక్షలో లోకేశ్ దృష్టికి తెచ్చారు. వాస్తవానికి విద్యార్థులందరికీ ఇంటర్నల్ మార్కులు గరిష్ఠంగా 20 మార్కులు వేయడానికి నిబంధనలు ఒప్పుకోవని కూడా వారే మంత్రికి తెలిపారు.