Visakhapatnam Drugs Container Case Updates :సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ తీరంలో డ్రగ్స్ కంటెయినర్ కలకలం రేపిన విషయం తెలిసిందే. డ్రైడ్ ఈస్ట్ మాటున డ్రగ్స్ దిగుమతి కావడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈస్ట్ బ్యాగ్‌లలో ఎంతమేర డ్రగ్స్ కలిశాయో తెలుసుకోవడానికి అధికారులు నమూనాలు సేకరించారు. వాటిని సీబీఐకి చెందిన ప్రయోగశాలలకు పంపి నాలుగు నెలలవుతోంది. ఇప్పటికీ నివేదికలు బయటకు రాలేదు. దిల్లీ కేంద్రంగా సీబీఐ దర్యాప్తు చేస్తుండటంతో కేసులో పురోగతి ఏమిటనేది ప్రస్తుతం ఏపీలో చర్చ సాగుతోంది.
విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆర్డర్ పెట్టగా బ్రెజిల్ నుంచి 25,000ల కిలోల ఇన్‌యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ ఈ సంవత్సరం మార్చి 16న పోర్టుకు చేరింది. దీనిపై ఇంటర్‌పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడ పేరుతో దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు కంటెయినర్‌ను తెరిచి బ్యాగ్‌లను పరిశీలించారు. నిషేధిత మత్తు పదార్థాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత బ్యాగ్‌లలో ఎంత శాతం డ్రగ్స్ కలిశాయో తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. ఈస్ట్ బ్యాగ్‌లను వేరే కంటెయినర్‌లోకి మార్చి సీల్ వేశారు.
CBI investigation Vizag Port Drugs Case :సాక్ష్యాల సేకరణ, దిగుమతిదారుల వాంగ్మూలం నమోదు తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు దిల్లీ వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆపరేషన్ గరుడ కేసును అక్కడి నుంచే దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ బృందం బ్రెజిల్ వెళ్లినట్లు సమాచారం. నగదు లావాదేవీలు, కస్టమ్స్‌ను తప్పించుకుని బ్రెజిల్ నుంచి నౌక ఎలా వచ్చింది? వంటివాటిపై ఆరా తీసి ఏం తేల్చారనేదీ బయటకు రాలేదు.