Case Filed on Municipal Vice Chairperson Gangadevi:పొదుపు సొమ్మును డ్రా చేసుకుని సొంతానికి వాడుకుని తిరిగి చెల్లించలేదన్న ఫిర్యాదుతో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గంగాదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గంగాదేవి గతంలో పొదుపు సంఘాల సమాఖ్య కోశాధికారిగా ఉండేవారు. అప్పటి పొదుపు సంఘాల అధ్యక్షురాలు మెహతాజ్, కార్యదర్శి సులోచన సహకారంతో గంగాదేవి సంఘంలోని మూడు లక్షల రూపాయలను డ్రా చేసుకుని సొంతానికి వాడుకున్నారు.
ఈ విషయాన్ని గుర్తించిన పొదుపు సమాఖ్య మహిళలు డ్రా చేసుకున్న సొమ్మును తిరిగి జమ చేయాలని ఒత్తిడి చేశారు. సమాఖ్య సభ్యుల డిమాండ్‌తో ఒక లక్ష 25 వేల రూపాయలను గంగాదేవి పొదుపు సమాఖ్య ఖాతాకు జమ చేశారు. మిగతా సొమ్మును చెల్లించలేదు. మహిళా సంఘాల పొదుపుపై ఇటీవల ఆడిట్ పూర్తి అయింది. గతంలో కోశాధికారిగా ఉన్న మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గంగాదేవి వాడుకున్న సొమ్ము వడ్డీతో కలిపి రెండు లక్షల 85 వేల రూపాయలు ఆమె పేరిట బకాయి ఉన్నట్లు ఆడిట్ అధికారులు తేల్చారు.