Benefits of Cholesterol in Body : నేటి కాలంలోఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, నిద్రలేమి కారణమేదైనా చిన్న వయసులోనే అందరినీ వేధిస్తున్న సమస్య శరీరంలో కొవ్వు పేరుకుపోవడం. కానీ అవగాహన లేమితో కొవ్వును తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తే మొదటికే మోసం రావొచ్చని ప్రముఖ హృద్రోగ నిపుణుడు సోమరాజు హెచ్చరించారు. భారత వైద్య సంఘం (ఐఎంఏ) 66వ రాష్ట్ర వార్షిక సదస్సు ముగింపు సందర్భంగా ఆదివారం గుంటూరులోని జింకాన ఆడిటోరియంలో జరిగిన డాక్టర్ ఎన్.అప్పారావు స్మారక ఉపన్యాసంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కొవ్వు మన శరీరానికి శత్రువేమీ కాదని సోమరాజు తెలిపారు. కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోతే మెదడు పనితీరు అస్తవ్యస్తమవుతుందని చెప్పారు. రోగనిరోధకశక్తి బలహీనం కావడం, ఎముకలు క్షీణించడం, మతిమరుపు, నొప్పులు వంటి సమస్యలెన్నో ముంచుకొస్తాయని పేర్కొన్నారు. కాబట్టి కొవ్వు మరీ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదని వివరించారు. మనం తినే ఆహారంతోనే 80 శాతం ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వెల్లడించారు. వారానికో రోజు ఉపవాసం ఉత్తమమని సూచించారు.
రక్తపోటును వైద్యుడే చూడాలి : చాలా ఆసుపత్రుల్లో రక్తపోటును కొలవడానికి సిబ్బందిని కేటాయిస్తున్నారని సోమరాజు తెలిపారు. ఇది మంచి విధానం కాదని చెప్పారు. బీపీని వైద్యుడే చూడాలన్నారు. సిస్టాలిక్ పోటు బాగానే ఉంటే డయాస్టాలిక్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. దీంతో పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఈ రోజుల్లో రోగుల నాడి పట్టి చూసే వైద్యులే కరవయ్యారని సోమరాజు వ్యాఖ్యానించారు.