Cancer Cases Rising in AP :ఏపీలో క్యాన్సర్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆరోగ్యశ్రీలో చికిత్సలు పొందే వారే 15 సంవత్సరాల్లో 70 శాతం పెరిగారు. 2009-2010లో 27,097 మంది ఉన్నారు. 2024-25లో (నవంబర్ వరకు) 46,223 మంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద ఏటా సగటున 45,000ల నుంచి 50,000ల క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. క్యాన్సర్ బాధితుల్లో మహిళలే ఎక్కువ. 2009-2010లో 67,218 కేసులు నమోదయ్యాయి. 2024-2025లో (నవంబర్ వరకు) 2,22,605 వచ్చాయి. ఇది 231 శాతం ఎక్కువ.
క్యాన్సర్ రోగులకు దశలవారీగా చికిత్స అవసరం కావడంతో ఒక్కొక్కరు సంవత్సరానికి నాలుగైదు సార్లు చికిత్సకు వస్తున్నారు. ఈ క్రమంలో బాధితుల సంఖ్య కంటే ఆరోగ్యశ్రీ ట్రస్టులో నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. 2014-2015 నుంచి పరిశీలిస్తే పదేళ్లలో బాధితుల సంఖ్య 8 శాతం, కేసుల సంఖ్య 179 శాతం చొప్పున పెరిగింది.
మహిళలు 28,725, పురుషులు 17,498 మంది :ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా 2024-2025 నవంబర్లో 28,725 మంది మహిళలు చికిత్స పొందగా పురుషులు 17,498 మంది ఉన్నారు. బాధిత మహిళల్లో 27 శాతం మంది రొమ్ము, 24 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లతో బాధపడుతున్నట్లు అంచనా. ఆ తర్వాత అండాశయం, తల, మెడ (నోరు, గొంతు, థైరాయిడ్ తదితర), ఉదరం (పొట్ట, పెద్దపేగు, చిన్నపేగు) క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటున్నారు.