Break For The Teachers Transfers : మంత్రి బొత్స సత్యనారాయణకు డబ్బులిచ్చినా బదిలీలు కాలేదంటూ ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. సిఫార్సు బదిలీలలను నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలివ్వడంతో ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనిపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముంది. ఎన్నికల ముందు కోట్ల రూపాయలు దండుకొని మంత్రి బొత్స సత్యనారాయణ, కొందరు అధికారులు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకుల సిఫార్సులతో వచ్చిన ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకొని మంత్రి, ఆయన పేషీలో పనిచేసే పీఏ, పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్, సచివాలయంలో పనిచేసే కొందరు అధికారులు కలిసి ఎన్నికల ముందు హడావుడిగా బదిలీలు చేశారు. వీటిపై అప్పట్లోనే అనేక ఆరోపణలొచ్చాయి. బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖలోని కీలక అధికారి సహకారం అందించారు.
రెండు శాఖలను కలిపి కూర్చోబెట్టి: విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడంతో ఆ సంవత్సరం ముగింపు రోజున పాత పాఠశాలలో రిలీవ్ అయి, కొత్త బడుల్లో చేరాలని మొదట ఆదేశాలిచ్చారు. ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో కోడ్ ముగిసిన తర్వాత కొత్త పాఠశాలల్లో చేరాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ గురువారంతో ముగియడంతో ఉపాధ్యాయులు కొత్త బడుల్లో చేరే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నందున వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
టీచర్ల బదిలీ ఉత్తర్వులు నిలిపివేత- అవినీతి ఆరోపణలపై విచారణ! - TEACHERS TRANSFER ORDERS cancel
డబ్బులు పోయే బదిలీ ఆగిపోయే: రాజకీయ సిఫార్సు బదిలీలకు ఒక్కో ఉపాధ్యాయుడు 3 నుంచి 6 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. వివిధ కారణాలతో పట్టణాలు, నగరాల సమీపంలోకి వచ్చేందుకు ఈ బదిలీలను ఆశ్రయించారు. మంత్రి, ఆయన పేషీలోని పీఏ, కొందరు అధికారులు కలిసి దాదాపు 50 కోట్లు ఈ బదిలీల్లో దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. బదిలీలు నిలిచిపోవడంతో డబ్బులూ పోయాయి బదిలీలు ఆగిపోయాయని బాధిత ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.