Boy Died Due to Chicken Piece : ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు ఏం తింటున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే వారు ఒక్కచోట కుదురుగా ఉండకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. మనం గమనించకుండా ఉన్నామా చటుక్కున్న దొరికిన వస్తువుని నోట్లోకి వేసుకుంటారు. కొన్నిసార్లు వాటి వల్ల ఏమీ కాకపోచ్చు కాని మరికొన్ని సార్లు అవే ప్రమాదాన్ని కలిగిస్తాయి. తాజాగా ఆడుకుంటూ చికెన్ ముక్కను మింగడంతో అది గొంతులో అడ్డుపడి ఊపిరాడక ఓ బాలుడు చనిపోయాడు. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
అప్పటివరకు ఆ బాలుడు ఇంట్లో బుడిబుడి అడుగులేస్తూ నవ్వుతూ అల్లరి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. అకస్మాత్తుగా ఆ బాబు కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో ఏమైందోనని వారు తల్లడిల్లిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే మరణించాడు. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల జిల్లాకు చెందిన కృష్ణయ్య, మణి దంపతులు జీవనోపాధి నిమిత్తం రాజంపేట మండలం మన్నూరుకు కొంతకాలం కిందట వలస వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు.
Boy Died Chicken Piece at Rajampet : ఆదివారం వారు చికెన్ తెచ్చుకుని వండుకుని తిన్నారు. ఇంతలోనే పనులకు వెళ్లాలని సిద్ధమవుతుండగా వాళ్ల రెండున్నరేళ్ల కుమారుడు సుశాంక్ కింద పడి ఉన్న చికెన్ ముక్కను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక కింద పడిపోయాడు. ఏమైందోనని ఆందోళనతో తల్లిదండ్రులు లేపాలని చూశారు. కానీ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే 108లో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే మరణించాడు.