Bhavani Deeksha Viramana: విజయవాడలోని ఇంద్రకీలాద్రికి ఈ నెల 21 నుంచి ఈ నెల 25వ తేదీ వరకూ భవానీ దీక్షల విరమణ కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కొండపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకొని, ఇరుముడులను సమర్పిస్తారు. భారీగా వస్తున్న భక్తులు సులువుగా సేవలు పొందేలా ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాంకేతిక సాయంతో దర్శనాల బుకింగ్, ప్రసాదం కేంద్రాలు, రవాణా సౌకర్యం, పార్కింగ్ ప్రదేశాల్లో రద్దీ, ప్రథమ చికిత్స కేంద్రాలు, కేశఖండశాల వివరాలును సెల్‌ఫోన్‌లో తెలుసుకునే వీలు కల్పించింది.
ముఖ్యంగా భవానీలు ఇరుముడులతో చేసే గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించింది. ప్రదక్షిణ చేస్తున్న భక్తులు ఎక్కడున్నారు, ఎంత సేపట్లో ప్రదక్షిణ పూర్తి చేయగలరు వంటి వివరాలను అందులో సులభంగా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘భవానీ దీక్ష-2024’ యాప్ (Bhavani Deeksha 2024 App) డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ సేవలు పొందొచ్చు.
మరెన్నో ప్రయోజనాలు:భవానీ దీక్ష విరమణ భక్తుల కోసం అందుబాటులోకి వచ్చిన యాప్‌తో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. క్యూ లైన్ల ఏర్పాట్లు, వెయింటిగ్ హాళ్లు, పార్కింగ్ స్థలం, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదాల పంపిణీ వంటి వివరాలు యాప్ ద్వారా భక్తులకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దర్శనం కోసం, ప్రసాదాల కోసం ఎంతో సలువుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.