Bapatla Medical College Construction Stopped In YSRCP Regime :బాపట్లకు వైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్లు 2020 మార్చిలో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్ కాలేజీ కోసం జమ్ములపాలెం రోడ్డులో 55 ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించింది. 500 పడకల బోధనాసుపత్రి, తరగతి గదులు, వసతి గృహాలు, నర్సింగ్ కళాశాల భవనం, క్యాంటీన్ నిర్మిస్తామని ప్రకటించింది. 2021 మే31న వైద్య కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రెండున్నరేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభిస్తామని గొప్పగా ప్రకటించారు.
వైద్య కళాశాల ప్రారంభం ద్వారా కొత్తగా ఎంబీబీఎస్ (MBBS) సీట్లు మంజూరవుతాయని ఆశలు కల్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెప్పిన గడువు 2023 డిసెంబరుకు ముగిసింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో మేఘా సంస్థ పనులు ఆపేసింది. నిర్మాణానికి తెచ్చిన భారీ యంత్రాలను తరలించడంతో వైద్యకళాశాల నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కళాశాల, బోధనాసుపత్రి నిర్మాణానికి 505 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నాబార్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కళాశాల, ఆసుపత్రి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మొదటి దశలో 297 కోట్లు మంజూరు చేశారు. నాబార్డు నుంచి 252 కోట్లు రాగా, ప్రభుత్వం నుంచి 45 కోట్లు రావాల్సి ఉంది. 500 బెడ్ల ఆసుపత్రి, 100 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభించటానికి ప్రణాళిక రూపొందించారు.
మెగా ఇంజినీరింగ్ వర్క్స్ ఏజెన్సీ ద్వారా ఇప్పటివరకు 70 కోట్ల రూపాయల విలువైన 15 శాతం పనులు జరిగాయి. నాబార్డు నిధులను దారి మళ్లించడంతో నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేసినా భవనాలు పూర్తి చేయాలంటే మరో రెండేళ్లు పట్టేలా ఉంది. ఈ పరిస్థితుల్లో 2025-26లో MBBS తరగతులు ప్రారంభం కావటం అసాధ్యంగా కనిపిస్తోంది.