New Car Buying Tips :కారు కొనేటప్పుడు అనేక మంది ధర, మైలేజీ, మోడల్, అలాయ్ వీల్స్ , వాటిలోని ఫీచర్లను చూస్తుంటారు. కానీ ప్రమాదాలు జరిగితే అందులోని ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ ఎంత అన్నది ఎంత మంది ఆలోచించేవారి సంఖ్య తక్కువే. కానీ అదే చాలా కీలకం. అందుకే కారు కొనేందుకు షోరూంకు వెళ్తే, ఎన్‌క్యాప్ (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) రేటింగ్‌పై ఆరా తీయాలని వాహనరంగ నిపుణులు సూచిస్తున్నారు. అత్యాధునిక బ్రేకింగ్, ప్రమాదాన్ని పనిగట్టి సమన్వయంగా అప్రమత్తమయ్యే అడాస్ వ్యవస్థలున్న కార్ల ధర కాస్త ఎక్కువైనా వాటినే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లోనూ సురక్షిత వ్యవస్థలున్న కార్లు అందుబాటులో ఉన్నాయని, ముఖ్యంగా బాడీ పటిష్ఠతను దృష్టిలో పెట్టుకుని కారు తీసుకోవాలని అంటున్నారు.
క్రాష్‌టెస్ట్ రేటింగ్ చూసారా :కొన్నాళ్ల కిందట హైదరాబాద్‌లో ఓ పోలో కారు వంతెనపై నుంచి పల్టీ కొట్టి కింద పడింది. అయినా అందులో ఉన్న ప్రయాణికులకు ఏమీ కాలేదు. మరో ప్రమాదంలో కారు వేగంగా ఢీ కొట్టడంతో బ్రిడ్జి బద్దలైంది, అయినా ప్రయాణికులు సురక్షింగా ఉన్నారు. రెండిటిలో చూసుకుంటే గట్టిదనం గల కారు బాడీ, సురక్షితమైన భద్రతా వ్యవస్థలే దీనికి ప్రధాన కారణం. కారు ప్రమాధానికి గురైతే, డ్రైవర్, ప్రయాణికుల భద్రత ఎంతన్నది క్రాష్ టెస్ట్ ద్వారా అంచనా వేయడానికి గ్లోబల్ ఎన్‌క్యాప్‌లు రూపొందించారు. ఇందులో కారు వేగం, వివిధ కోణాల్లోంచి ఢీ కొడితే పడే ప్రభావం, లోపలున్న పిల్లలకు, పెద్దలకు కలిగే నష్టం తదితర పరీక్షల ఆధారంగా పిల్లలు, పెద్దలు వేర్వేరుగా 1 నుంచి 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. కొన్ని కంపెనీలు తమ కార్లను క్రాష్ టెస్టుకు పంపించవు. కారు కొనేటప్పుడు వాటి గురించి వారిని అడగాలి.
కాప్ క్రాష్ టెస్టింగ్ అంటే : క్రాష్ టెస్ట్ అంటే చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. ప్రమాదంలో గాయాల తీవ్రతను అంచనా వేయడానికి పిల్లలు, పెద్దల డమ్మీ బొమ్మల తల, ఛాతీ, పొత్తికడుపు, కాళ్లు, చేతుల్లో బహుళ యాక్సిలోమీటర్లు, లోడ్ సెన్సర్లు అమర్చుతారు. ముఖ్యమైన అవయావాలకు జరిగే నష్టాన్ని గ్రాఫ్ వేసి దాని ద్వారా విశ్లేషిస్తారు. వాటి ప్రకారం పాయింట్లు ఇస్తారు. ఏడాదిన్నర నుంచి మూడేళ్ల లోపు వయసున్న పిల్లల నమూన బొమ్మలను ఐఎస్‌ఓఎఫ్‌ఐఎక్స్ సీట్లలో ఉంచుతారు. 49 పాయింట్లను ప్రామాణికంగా తీసుకుని పరీక్షిస్తారు. ఇందుకు కెమెరాలు, సెన్సర్లు సహా అధునాతన సాంకేతికతను వినియోగిస్తారు. పరీక్షించాల్సిన కారును ఉక్కు, అల్యూమినియంతో చేసిన ట్రాలీలతో ఢీ కొట్టి చూస్తారు. ఈ పరీక్షలు వాటి ఫలితాలు రోడ్లపై జరిగే వాస్తవ ప్రమాదాలకు భిన్నగా ఉండొచ్చు అయినా ఈ ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుంటారు.
రేటింగ్స్ బట్టి కొంటే :కారు భద్రతా ప్రమాణాలను విశ్లేషించేందుకు దేశంలోని కార్ల తయారీ సంస్థలు ఇప్పటి వరకు గ్లోబల్ ఎన్‌క్యాప్ రేటింగ్‌పై ఆధారపడుతున్నాయి. గతేడాది నుంచి కేంద్రం భారత్ ఎన్‌క్యాప్‌ను మొదలుపెట్టింది. గ్లోబల్ ఎన్‌క్యాప్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూచ్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఆటోమేజీవ్ రీసెర్చి అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫల్ ఆటోమేటీవ్ టెక్నాలజీ సంస్థల నిపుణుల సేఫ్టీ రేటింగ్‌ను ఇస్తారు. గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో 5 స్టార్ రేటింగ్, కొత్త ప్రోటోకాల్ విధానంలో పిల్లలు, పెద్దల రక్షణకు అధిక పాయింట్లు సాధించిన కార్లను ఎంచుకునేందుకు ఉపయోగపడుతుంది.
డ్రైవర్‌కు మార్గదర్శి అడాస్ :డ్రైవర్లు సురక్షితంగా వాహనాన్ని నడపడానికి, మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాల్ని నిరోధించడానికి రాడార్లు, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, సెన్సర్లు, కెమెరాలతో కూడిన అడాస్ దోహదపడుతుంది. ఇది ప్రమాదాన్ని ముందే గుర్తించి, స్వయంచాలితంగా బ్రేక్‌లు వేస్తుంది. డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఇందులోని కెమెరా, సెన్సర్, రాడార్, లేజర్, జీపీఎస్ వ్యవస్థలు ముందున్న రహదారిలో అడ్డంకుల్ని గుర్తించి, తక్షణమే అప్రమత్తమై వాహన వేగాన్ని తగ్గిస్తాయి. అంటే ప్రమాదాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రమాదాలను గుర్తించడం, హెచ్చరికలు జారీ చేయడం, స్వయంచాలక బ్రేకింగ్ వ్యవస్థల నిర్వహణకు కావాల్సిన సెన్సర్లు, కెమెరాలు ఇందులో ఉంటాయి. పాదచారుల్ని గుర్తించి బ్రేక్ ఉపయోగిస్తుంది. లైన్ నుంచి పక్కకు వెళ్తే హెచ్చరిస్తుంది. కన్పించని వైపు నుంచి వచ్చే ప్రమాదాల్ని గుర్తించి అప్రమత్తమవుతుంది. పార్కింగ్‌లోనూ సహాయ పడుతుంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా విక్రయించే వాహనాల్లో 90 శాతం వరకు అడాస్ కలిగి ఉంటాయని అంచనా.
అప్రమత్తం చేసే బ్రేకింగ్ వ్యవస్థ :
- బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ (బీఏఎస్) : అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని నిలపడానికి, దూరాన్ని తగ్గించడానికి ఉపకరిస్తుంది. డ్రైవర్ బ్రేక్ వేయగానే పెడల్‌పై పడే ఒత్తిడిని బట్టి ఎమర్జెన్సీని గుర్తిస్తుంది. ఏబీఎస్‌కు ముందే ఇది అప్రమత్తమవుతుంది. ఇందులో మెకానికల్, ఎలక్ట్రానిక్ అనే రెండు రకాలుంటాయి.
- యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) : బ్రేక్ వేసినప్పుడు టైర్ లాక్ కాకుండా నియంత్రించేందుకు, ఆపే దూరాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది.
- ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) : ఒత్తిడిని ప్రతి చక్రానికీ వర్తింపజేస్తూ బ్రేకింగ్ ఫోర్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. ఏబీఎస్‌తో కలిసి పనిచేస్తుంది.
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ) : వేగంలో స్థిరత్వం కల్పిస్తుంది. హఠాత్తుగా బ్రేక్ వేసినప్పుడు కారు పల్టీ కొట్టకుండా, పక్కనున్న వాహనాలను ఢీకొట్టకుండా (సైడ్ క్రాష్) దోహదపడుతుంది.
ఎక్కువ ఎయిర్ బ్యాగ్స్ ఎంతో రక్షణ :ముందు, పక్క, వెనక వైపు నుంచి వాహనాలు ఢీకొన్నప్పుడు మిల్లీ సెకన్లలోనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకొని ప్రయాణికుల తల, ఛాతీ, మెడ భాగాలపై ఒత్తిడి పడకుండా, తీవ్ర గాయాల నుంచి రక్షణనిస్తాయి. కొన్ని కార్ల తయారీ సంస్థలు ముందు, వెనక కూర్చున్న వారికి రక్షణ కల్పించేలా సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్‌ను 2, 4, 6 చొప్పున అమర్చుతున్నాయి. ఢీకొట్టే వేగం, దిశను బట్టి అధునాతన సెన్సర్లు, ఇన్‌ఫ్లేషన్ మెకానిజం, క్రాష్ సెన్సర్లు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU), వైరింగ్, కనెక్టర్లు ప్రభావవంతంగా పనిచేసి ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకునేలా చేస్తాయి.