Attack on Proddatur SI in Police Station :శాంతి భద్రతలను పరిరక్షించి ప్రజలకు అండగా నిలుస్తున్న పోలీసులకే రక్షణ లేకుండా పోతోంది. స్టేషన్కు వెళ్లి మరీ వారిపై దాడులతో రెచ్చిపోతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రూరల్ స్టేషన్ ఎస్ఐ మహమ్మద్ రఫీపై దాడి కలకలం రేపుతోంది. మఫ్టీలో ఉండగా స్టేషన్లోనే ఆయనపై రాజుపాళేనికి చెందిన లింగమయ్య, అతని బంధువులు చేయిచేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్ఐ ఫిర్యాదు మేరకు మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వైఎస్సార్ జిల్లా రాజుపాళెంకు చెందిన చిన్న లింగమయ్య, ప్రొద్దుటూరుకు చెందిన హర్ష అనే ఇద్దరు యువకులు బైక్పై చిన్నశెట్టిపల్లె రోడ్డు నుంచి ప్రొద్దుటూరు పట్టణంలోకి వేళ్లేందుకు బైపాస్ రోడ్డు దాటుతుండగా జమ్మలమడుగు వైపు నుంచి కడపకు వెళ్తున్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరికీ గాయాలు అయ్యాయి. దీంతో అటువైపు వెళ్తున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ గుర్తించి వెంటనే పోలీస్ జీపులోనే క్షతగాత్రులను ప్రొద్దుటూరులోని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం కారు డ్రైవర్ కడపలోని కొండాయపల్లెకు చెందిన వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని గ్రామీణ ఠాణా వద్దకు వెళ్లారు. సాధారణంగా రోడ్డు ప్రమాదాల ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వ్యక్తులకు నోటీసులు ఇచ్చి పంపిస్తారు. ఆ ప్రకారమే ప్రొద్దుటూరులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కారు డ్రైవర్ వెంకటరెడ్డికి నోటీలు అందించి పంపించారు.