ASP Dilip Kiran on Fake IPS in Pawan Kalyan Parwathipuram Tour :పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి పాల్గొన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఇప్పటికే పోలీసు అధికారులు విచారణ చేపట్టి కేసును ఛేదించారు. యూనిఫామ్‌లో ట్రైనీ ఐపీఎస్ పేరుతో బలివాడ సూర్య ప్రకాశ్ (41) వచ్చాడని, పార్కింగ్ ప్లేస్ వద్ద సూర్య ప్రకాశ్‌ను నిలిపివేశామని ఏఎస్‌పీ దిలీప్ కిరణ్ తెలిపారు. కొంచెం దూరం నడిచివెళ్లి పార్కింగ్ ప్లేస్ దగ్గరకు వచ్చాడని, పవన్ కల్యాణ్ వ్యూపాయింట్‌కు వెళ్లాక శంకుస్థాపన స్థలం వద్దకు వెళ్లాడని, ఫొటోలు తీసుకుని వాట్సప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడని వెల్లడించారు.
ఆ రోజే అదుపులోకి తీసుకున్నాం : కొంతమందికి అనుమానం వచ్చి తమకు ఫిర్యాదు చేశారని, వెంటనే నకిలీ ఐపీఎస్ సూర్య ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నామని దిలీప్ కిరణ్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పవన్ కల్యాణ్ కార్యక్రమం పూర్తయ్యాక వెళ్లి ఫొటోలు దిగాడని అన్నారు. పవన్ కల్యాణ్ ఉన్నప్పుడు మాత్రం ఆయన దగ్గరకు వెళ్లలేదని స్పష్టం చేశారు. దత్తిరాజేరులో సూర్యప్రకాశ్ తండ్రి 9 ఎకరాలు పొలం కొన్నారని, కాగితాలు రాసుకున్నారు కాని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని, ఆ భూమిని సొంతం చేసుకునేందుకు పోలీసు అధికారి అవతారం ఎత్తాడని తెలిపారు. నిందితుడి నుంచి కారు, ఐడీ కార్డులు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు.