ASHA Workers Protest DMHS Office in Hyderabad:డిమాండ్ల సాధన కోసం ఆశ వర్కర్లు హైదరాబాద్‌లో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారీ తీసింది. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) కార్మిక విభాగం ఆధ్వర్యంలో కోఠిలోని డీఎంహెచ్‌ఎస్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆశా కార్యకర్తలకు రూ.18,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు తరలివచ్చి కార్యాలయం లోపలికి తోసుకొని వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు.
దీంతో పోలీసులకు, ఆశా కార్యకర్తలకు తోపులాట, తీవ్ర వాగ్వివాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓ ఆశ కార్యకర్త సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ చారిపై చేయి చేసుకుంది. డిసెంబర్ 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లెప్రసి సర్వే చేయాలని ఆశాలకు జిల్లా అధికారులు చెప్తున్నారని ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఆపాలని కోరారు. 2 సంవత్సరాల నుంచి చేసిన లెప్రసి సర్వే 2024లో చేసిన పల్స్ పోలియో డబ్బులు రాక ఆశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించి ఆశాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.