AS Raja Blood Bank Stands by People of Visakhapatnam : విశాఖ ప్రజలకు ఎ.ఎస్. రాజా బ్లడ్ బ్యాంక్ సంస్థ ఆపన్న హస్తంగా ఉంది. అంతర్జాతీయ రెడ్ క్రాస్ గుర్తింపు పొందిన ఈ సంస్థ ఎలాంటి లాభం ఆశించకుండా ప్రజలకు రక్తం అందిస్తూ ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర పురస్కారాలు కూడా పొందింది. ఎక్కువగా పేద, మధ్య తరగతి వర్గాలవారికి ప్రాధాన్యత ఇస్తుంది ఈ సంస్థ. కరోనా లాంటి సమయంలో రక్త కొరత లేకుండా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు.
పేద, మధ్య తరగతి వర్గాలవారికే మెుదటి ప్రాధాన్యత :విశాఖ రామ్‌నగర్‌లో అన్ని ప్రధాన పెద్ద ఆస్పత్రులు ఉన్న చోట ఏళ్ల తరబడి విశాఖ వాసులు కోసం పనిచేస్తున్న ఏకైక సంస్థ ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంకు. ముఖ్యంగా పేద మధ్య తరగతి వర్గాలవారికి ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఉంటుంది. బయట ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల తరహాలో కాకుండా ఎటువంటి లాభపేక్ష లేకుండా పనిచేస్తున్న సంస్థ ఇది. కేవలం రక్తం ఒకటే కాదు ప్లాస్మా, వైట్ సేల్స్ అందించి రోగుల ప్రాణాలు కాపాడుతున్న బ్లడ్ బ్యాంకు ఇది.
లాభపేక్ష లేకుండా ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న సంస్థ :కేవలం నగర వాసులకు రక్తం ఇవ్వడమే కాకుండా ప్రకృతి విపత్తుల సమయంలో ముందుకు వెళ్లి బాధితులకు సేవలు అందిస్తారు. పలు రైళ్లు ప్రమాదానికి గురైనప్పుడు ముందుగా ఆ ప్రాంతానికి చేరుకొని రక్తం ఇచ్చిన ఘనత ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంకు ట్రస్ట్దే. అలాగే వివిధ కళాశాలలో యువత ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రక్త నిల్వలను పెంచుతూ విశాఖలో అత్యవసర సమయంలో రక్తం అందించే సంజీవినిగా నిలుస్తోంది.