ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీమాపై మరింత ధీమా - వైద్య సేవలు మెరుగుపడేలా కూటమి ప్రభుత్వం కసరత్తు - health insurance - HEALTH INSURANCE

Health Insurance : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీమా అమలుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జారీచేసిన ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ అధికారులతో సమాలోచనలు ప్రారంభించారు. బీమా విధానంలో రోగులకు వైద్య సేవలు ఇప్పటికంటే మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకునేందుకు సమయాత్తమవుతున్నారు.

health_insurance
health_insurance (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 8:00 AM IST

NDA Government Focus on Health Insurance : బీమా విధానంలో రోగులకు వైద్య సేవలు మరింత మెరుగుపడేలా ట్రస్టు, హైబ్రీడ్, బీమా విధానం అమల్లో ఉన్న రాష్ట్రాల గురించి వివరాలు సేకరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా రోగులకు సేవలు ప్రారంభించిన సమయంలో కొద్దికాలం బీమా విధానంలోనే కార్యకలాపాలు కొనసాగాయి. వేర్వేరు కారణాలతో ట్రస్టు విధానంలో రోగులకు చికిత్స ప్రారంభించారు. అనుబంధ ఆసుపత్రుల వారు రోగులకు అందించిన చికిత్సకు తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది.

అయితే ఈ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. అంతేకాకుండా పాత ప్యాకేజీ ధరలకు అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నందున గిట్టుబాటు కావడం లేదని ఆసుపత్రుల యాజమాన్యాలు అడపాదడపా చికిత్స అందించేందుకు నిరాసక్తతను తెలియచేస్తున్నాయి. నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇదో పెద్ద సమస్యగా మారింది. బీమా విధానంలో గుర్తింపు కార్డులు కలిగిన వారు దేశ వ్యాప్తంగా ఉచితంగా చికిత్స పొందే అవకాశం ఉంది. ఈ ఆసుపత్రుల సంఖ్య 15 వేల వరకు చేరుకునే అవకాశం ఉంది.

టెండరు ద్వారా ఎంపిక చేసిన బీమా కంపెనీ ద్వారా రోగులకు సేవలు అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన లబ్ధిదారుల జాబితాకు అనుగుణంగా బీమా కంపెనీ కార్డులు పంపిణీ చేస్తోంది. రోగులు చేరిన వెంటనే ఆసుపత్రుల వారు నేరుగా బీమా కంపెనీకి సమాచారాన్ని పంపుతారు. అక్కడి నుంచి అనుమతి వచ్చిన వెంటనే చికిత్స ప్రారంభిస్తారు. చికిత్స అనంతరం ఆసుపత్రుల వారు బీమా కంపెనీకి పూర్తి వివరాలు పంపుతారు. దీనికి అనుగుణంగా నిర్దేశిత వ్యవధిలో బీమా కంపెనీ నుంచి ఆసుపత్రులకు చెల్లింపులు జరుగుతాయి. బీమా కంపెనీలకు ప్రభుత్వపరంగా చెల్లింపులు జరగాలి. జాతీయ కంపెనీలు ఇందుకు ముందుకొస్తాయి.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో రూ.7వేల కోట్లు బకాయి పెట్టింది: మంత్రి సత్యకుమార్​ - ap health minister

రాష్ట్రంలో 1.35 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ గుర్తింపు కార్డులు ఉన్నాయి. 5.5 లక్షల మంది ఉద్యోగులు, సుమారు 3 లక్షల మంది పెన్షనర్లకు ఈహెచ్‌ఎస్‌ చికిత్స అందిస్తున్నారు. ప్రతి ఏడాది సుమారు 4 వేల కోట్ల వరకు ఖర్చు అవుతోంది. చికిత్స పొందే ప్రతి వంద మందిలో 99శాతం మంది 2.50 లక్షల లోపు వైద్యాన్ని పొందుతున్నారు. మిగిలిన వారు 5నుంచి 15 లక్షల రూపాయల మధ్య వైద్యాన్ని పొందుతున్నారు. హైబ్రీడ్‌ విధానం మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఉంది. నిర్దేశించిన వార్షిక పరిమితి వరకు బీమా విధానంలో చికిత్స అందిస్తారు. మహారాష్ట్రలో 6 లక్షల వరకు బీమా విధానం అమల్లో ఉంది. ఇందులో 1.5 లక్షల వరకు బీమా కంపెనీ ద్వారా చికిత్స అందిస్తారు. ఆపైన ట్రస్టు ద్వారా రోగులకు చికిత్స అందిస్తున్నారు. బీమా విధానం రాజస్థాన్, జమ్మూ-కశ్మీర్, తమిళనాడు, నాగాలాండ్, మేఘాలయలో ఉంది. ఈ విధానంలో వార్షిక పరిమిత కింద విధించిన మొత్తానికి బీమా విధానంలోనే చికిత్స అందించాలి.

రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలి: మంత్రి సత్యకుమార్‌ - Satyakumar Met Union Ministers

వార్షిక పరిమితి 5 లక్షలు ఉంటే ఒక్కో కుటుంబానికి ప్రీమియం 1,900 వరకు ఉండే అవకాశం ఉంది. వార్షిక పరిమితి పెరిగేకొద్దీ ప్రీమియం పెరుగుతోంది. రాష్ట్రంలో వార్షిక పరిమితి 25 లక్షల వరకు ఉంది. ట్రస్టు విధానాన్ని ఏపీతోపాటు ఉత్తరప్రదేశ్, కేరళ, హర్యానా, బీహార్, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో డిస్కమ్, జెన్‌కో, ఇతర ప్రభుత్వ శాఖల్లో బీమా విధానం ఇప్పటికే అమల్లో ఉంది. అంతేకాకుండా.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వివిధ రంగాల వారికి ప్రత్యేక బోర్డులు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. వీటి ద్వారా కూడా బీమా విధానం కింద నిధులు సమీకరించేందుకు వీలుంది. భవన నిర్మాణ రంగ కార్మికలు, అసంఘటిత కార్మికులు, ట్రాన్స్‌పోర్టు, నాన్‌-ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు, మైనార్టీలు, న్యాయవాదులకు ప్రత్యేక బోర్డులు ఉన్నాయి.

వీటిల్లో సభ్యత్వం ఉన్న వారికి ఆయా బోర్డుల నుంచే ప్రీమియం కింద చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ పరంగా చెల్లింపులు జరగాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ‘జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ’ ప్రత్యేకంగా నడుస్తోంది. బీమా విధానంలో ఈ సంస్థ సేవలు కూడా ఉపయోగపడతాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ట్రస్టు ద్వారా గుర్తింపు కార్డులు పొందిన వారిలో 61 లక్షల కుటుంబాల వారికి ఆయుష్మాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా 400 కోట్ల వరకు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 5 లక్షల వార్షిక పరిమితి ఉంది. ఈ పరిమితిని 10 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రస్టు విధానంలో కాకుండా బీమా కింద ఈ సేవలు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

గత ప్రభుత్వానికి సమస్యలపై చెప్పాలంటే భయమేసేది- మంత్రి సత్యకుమార్‌ ఎదుట నర్సు ఆవేదన - Health Minister Sathyakumar

ABOUT THE AUTHOR

...view details