Amaravati Drone Summit 2024 :వినీలాకాశంలో కనువిందు చేసే విన్యాసాలు, శాస్త్ర సాంకేతికతకు సవాలు విసిరే ఆలోచనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటికల్స్ సమర్థ వినియోగానికి బీజం వేసే నిర్ణయాలు ఇలా బహుళ ప్రయోజనాలను అందిపుచ్చుకునే డ్రోన్ సమ్మిట్‌కు అమరావతి సిద్ధమవుతోంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేపటి నుంచి రెండు రోజుల పాటు అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసింది. పున్నమి ఘాట్ వద్ద 5,000ల పైగా డ్రోన్లతో మెగా షో ప్రత్యేక ఆకర్షణ కానుంది.
డ్రోన్స్ సాంకేతికత వినియోగంలో ఏపీని దేశానికి రాజధానిగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. డ్రోన్స్ సాంకేతిక సౌలభ్యాన్ని సమర్థంగా వినియోగించుకుని పలు దేశాలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయి. ఆ విధానాన్ని సమర్థవంతంగా అందిపుచ్చుకునేందుకు సర్కార్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇప్పటికే డ్రోన్ కార్పొరేషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం పాలనలో, విపత్తుల నిర్వహణలో ప్రజల దైనందిన జీవితంలో డ్రోన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సత్ఫలితాలు ఎలా సాధించాలనే దానిపై కసరత్తులు చేసింది.
Drone Summit in Mangalagiri : ఇందులో భాగంగా 22, 23 తేదీల్లో అమరావతిలో రెండు రోజుల పాటు ప్రతిష్ఠాత్మకంగా అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. పున్నమి ఘాట్ వద్ద నిర్వహించే డ్రోన్ షోను ప్రజలందరూ విస్తృతంగా తిలకించడానికి వీలుగా విజయవాడ నగరంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. 5 చోట్ల భారీ డిజిటల్ తెరలు ఏర్పాటు చేసి డ్రోన్ షోని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. విజయవాడలోని బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగు, వారధి, బస్టాండు, ప్రకాశం బ్యారేజీల వద్ద ఈ డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తున్నారు.
డ్రోన్ సమ్మిట్ విజయవంతానికి యంత్రాంగం రేయింబవళ్లు కృషి చేస్తోంది. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో 22వ తేదీ ఉదయం అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. సదస్సులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు లోకేశ్, బీసీ జనార్దనరెడ్డి పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం పున్నమి ఘాట్‌లో పెద్ద ఎత్తున డ్రోన్ షో, క్రాకర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 10 మంది డిప్యూటీ కలెక్టర్లకు ఈ ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. దాదాపు 300 మంది అధికారులు, సిబ్బంది ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.