Army Reached The Budameru Canal in NTR District : వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను అధికారులు సీఎంకు వివరించారు. అగ్నిమాపక వాహనాలతో రోడ్లు, కాలనీలు, ఇళ్ల క్లీనింగ్‌ను మరింత వేగవంతం చేయాలని సూచించారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. బుడమేరు కాలువ గండ్లు పూడ్చేందుకు ఆర్మీ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది.
గండ్లు పూడ్చివేత కార్యక్రమంలో భారత ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం రంగంలోకి దిగినట్లు తెలిపారు. యద్ద ప్రాతిపదికన పనులు చేపట్టి ఇప్పటికే అధికారులు రెండు గండ్లు పూడ్చారన్నారు. అత్యంత క్లిష్టంగా ఉన్న మూడో గండి పూడ్చివేత పనులను ఆర్మీ అధికారుల సహకారంతో ప్రభుత్వం వేగంగా పూర్తి చేయనుంది. అన్ని విభాగాల సమన్వయంతో మూడో గండి పూడ్చివేత పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
బుడమేరు విస్తరణ పనులను అర్ధాంతరంగా ముగించిన జగన్ సర్కార్ - కోట్లు కొట్టేసిన నేతలు - YSRCP Govt on Budameru Expansion
కరెంట్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్దరణ, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వివరాలు తెలుసుకున్నారు. నిత్యావసరాలతో కూడిన 6 వస్తువుల పంపిణీపైనా సమీక్ష చేసిన సీఎం ఇప్పటికే ప్యాకింగ్ పూర్తి చేసి సరఫరాకు సిద్దం చేసినట్లు అధికారులు వెల్లడించారు. వాహనాలు, ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్లను పిలిపించాలని ఆయన సూచించారు. అవసరమైతే కొంత పారితోషికం ఇచ్చి అయినా మెకానిక్‌లను, టెక్నీషియన్లను ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
బుడమేరుకు చేరుకున్న ఆర్మీ సిబ్బంది : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి - కవులూరు వద్ద బుడమేరు గండి పూడ్చేందుకు ఆర్మీ కార్యరంగంలోకి దిగింది. దీంతో అవసరమైన అన్నిరకాల పరికరాలతో ఆర్మీ కార్యక్షేత్రానికి వచ్చింది. ఇప్పటికే జరుగుతున్న పనులకు ఆర్మీ తమ వంతు సహకారం అందించనుంది. బుడమేరు వద్ద జరుగుతున్న పనులపై మంత్రి నిమ్మల రామనాయుడితో ఆర్మీ అధికారులు మాట్లాడారు. బుడమేరు కట్ట చివరి నుంచి మూడో గండి పడిన ప్రాంతం వరకు ఆర్మీ క్షుణ్నంగా పరిశీలించింది.
బుడమేరు రెండు గండ్లు పూడ్చివేత- పనులపై చంద్రబాబుకు నివేదిస్తున్న మంత్రి నిమ్మల - BUDAMERU LEAKAGE WORKS