Araku Coffee Second Cafe in Paris : మన్యం పేరు చెప్పగానే మనకు రెండు విషయాలు స్పురణకు వస్తాయి. ఒకటి అరకు అందాలు, ఇరుకైన ప్రయాణ మార్గాలు. వెళ్లినవారెవరైనా ఆ ప్రకృతికి ఫిదా అవ్వాల్సిందే. ప్రతి మది పులకరించాల్సిందే. అంతలా అక్కడి అందాలు కనువిందు చేస్తూ అందరినీ కట్టిపడేస్తాయి. మరొకటి కమ్మని అరకు కాఫీ. ఘుమఘుమలాడే దీని సువాసనకు మనసు మైమరచిపోతుంది. ఈ కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే.
Araku Coffee in Paris :తాజాగా ప్రేమ నగరిగా పేరొందిన పారిస్‌లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పారిస్‌కు వచ్చే క్రీడాకారులు, అతిథులు అరకు కాఫీని రుచి చూడనున్నారు. పారిస్‌లో 2017లో అరకు కాఫీ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మరో ఔట్‌లెట్‌ను తెరవాలనుకుంటున్నట్లు ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రకటించారు. 2018లో పారిస్‌లో జరిగిన ప్రిక్స్ ఎపిక్యూరస్- 2018 పోటీల్లో అరకు కాఫీకి బంగారు పతకం లభించింది.
PM Modi About Araku Coffee :మరోవైపు అరకు కాఫీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా ప్రమోట్ చేశారు. ఇటీవల మన్యం కాఫీ రుచిని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. గతంలో సీఎం చంద్రబాబుతో కలసి జీ-20 సదస్సులో ప్రధాని మోదీ అరకు కాఫీని రుచిచూశానని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన చంద్రబాబు వీలైతే మరోకప్పు మీతో కలసి కాఫీ తాగాలని ఉందంటూ రీట్వీట్ చేశారు.