APSRTC RETIRED EMPLOYEES PROBLEMS: వయసులో ఉండగా ఆర్టీసీ ఉద్యోగులు ఆ సంస్థ కోసం రేయింబవళ్లు కష్టపడ్డారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. ఇంత చేసినా వీరు రిటైర్డ్ అయ్యాక అందాల్సిన ప్రయోజనాలకు నోచుకోవడంలేదు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు వయోభారం వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. బీపీ, షుగర్, కిడ్నీ, గుండె, నరాల సంబంధిత సమస్యలు, పక్షవాతం తదితర అనారోగ్య సమస్యలూ వీరిని వెంటాడుతున్నాయి.
ఆదుకోవాల్సిన ఆర్టీసీ అక్కరకు రానంటోంది. అయిదేళ్లు పాలించిన వైఎస్సార్సీపీ సర్కారు సైతం తమకేమీ పట్టనట్టు వ్యవహరించింది. ఫలితంగా వైద్యం చేయించుకోలేక ఆదరణ కరవై ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వైఎస్సార్సీపీ సర్కారు, సర్వీసులో ఉన్నవారితోపాటు రిటైర్ అయిన వారందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పిస్తానని హామీ ఇచ్చింది. విలీనం అనంతరం తమ కష్టాలూ తీరతాయని విశ్రాంత ఉద్యోగులు పెట్టుకున్న కలలను జగన్ కలలుగానే మిగిచ్చారు. 2020 జనవరిలో విలీనం కాగా, అంతకు ముందు రిటైరైన వారేవ్వరికీ అదనంగా ఒక్క ప్రయోజనం చేకూర్చలేదు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం- కాపలా విధుల్లో బస్ కండక్టర్లు - RTC CONDUCTORS
పైగా ఎప్పట్నుంచో అందుతోన్న సదుపాయాలన్నింటినీ తొలగించి నిట్టనిలువునా మోసం చేశారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ అనంతరం పింఛన్ చాలా తక్కువగా వస్తుంది. వీరి కష్టాలు తీర్చేందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చేది. ఎన్టీఆర్ హెల్త్ కార్డు జారీ చేసి ఉచితంగా వైద్య సదుపాయం అందించేవారు. నిర్ణీత స్థాయి కంటే వైద్య ఖర్చులు ఎక్కువైతే సీఎం సహాయనిధి కింద ఆర్థిక సాయం అందించేవారు. ఆర్థికంగా చితికిపోయిన వారికి వృద్ధాప్య పింఛన్ సహా ఇళ్లు మంజూరు చేయడంతో అవసరాలు తీర్చుకుని సమాజంలో గౌరవంగా జీవించేవారు. కష్టాలే లేకుండా చేస్తానని పీఠమెక్కిన జగన్ రిటైర్డ్ ఉద్యోగులను కష్టాలపాలు చేశారు.
అధికారులతో సాధికారిక సర్వే చేయించిన జగన్, ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన వారందరినీ ఉద్యోగులుగా ప్రభుత్వ డేటాలో నమోదు చేయించారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను తీసేశారు. తీవ్రంగా అనారోగ్యం పాలైన వీరికి, వైద్యం నిలిచిపోవడంతో ఎన్నో ఏళ్లుగా అష్టకష్టాలు పడుతున్నారు. 2020 జనవరి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా EHS కార్డులిచ్చారు.