RTC Chairman Explains to Participation Gouthu Latchanna Program :వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌తో కలిసి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొనడంపై ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వివరణ ఇచ్చారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అనుకోకుండా జరిగిందని తెలిపారు. పార్టీ శ్రేణులు అపార్థం చేసుకోవద్దని కోరారు. పార్టీకి ద్రోహం చేసే పని తానెప్పుడు చేయనని స్పష్టం చేశారు. ఎల్లప్పుడు పార్టీకి విధేయుడిగానే పని చేస్తానన్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తో తనకు ఎటువంటి సంబంధాలు లేవని తేల్చిచెప్పారు. ఈ సంఘటనపై కొనకళ్ల నారాయణ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు.
జోగి రమేష్ తో కలిసి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఘటన యాదృచ్ఛికంగా జరిగిందని తెలిపారు. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఆహ్వాన కమిటీ వాళ్ల ఆహ్వానం మేరకే తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని తెలిపారు. జోగి రమేష్ వస్తున్నాడన్న సమాచారం తనకు ఏ మాత్రం లేదన్నారు. తాను అక్కడకు వెళ్లిన తర్వాత జోగి రమేష్ వచ్చాడని, గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదం చేయకూడదన్న ఉద్దేశంతోనే జోగి రమేష్ వచ్చినా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందని కొనకళ్ల తెలిపారు.
'ఇలా జరుగుతుందని మాకు తెలియదు' - క్షమాపణలు చెప్పిన మంత్రి, ఎమ్మెల్యే
దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఖండించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి అన్ని విషయాలు వివరిస్తానన్నారు. రేషన్ బియ్యం కేసులో పేర్ని నానిని కాపాడాల్సిన అవసరం కూటమి నేతలకు లేదని వ్యాఖ్యానించారు. పేర్ని నాని చేసిన తప్పుకు శిక్ష అనుభవించకతప్పదని తేల్చిచెప్పారు. పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అధికారాన్ని ఉపయోగించుకొని దోచుకుతిన్న వ్యక్తి పేర్ని నాని అని విమర్శించారు. పక్కదారి పట్టించిన బియ్యానికి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు నుంచి బయడపడలేరని కొనకళ్ల నారాయణ తేల్చిచెప్పారు.