AP Rankers in UPSC Civils Results 2024 :కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు. నాలుగో సంవత్సరంలోనే క్యాంపస్ ఇంటర్వ్యూలో మైక్రో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్. లక్షల్లో జీతం. అంతటితో ఆగలేదు ఆమె. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సిద్దమైంది. మూడు సార్లు విఫలమైనా అధైర్యపడలేదు. నాలుగో ప్రయత్నంలో లక్ష్యం చేరుకున్నారు రాజమహేంద్రవరానికి చెందిన అడుసుమిల్లి మౌనిక. సివిల్స్‌లో 487వ ర్యాంకు సాధించిన ఆమెను పలకరించగా తన అనుభవాలను వివరించారు.
ఇంజినీరింగ్ చదువుతుండగానే కొలువు : మౌనిక స్వస్థలం విజయవాడ అయినా రాజమహేంద్రవరంలో స్థిరపడ్డారు. తండ్రి ఎ. వెంకట ప్రేమ్‌చంద్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. తల్లి సునీత గృహిణి. టెన్త్, ఇంటర్ వరకు విజయవాడలో ఆమె విద్యాభ్యాసం సాగింది. అనంతరం హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ కళాశాలలో కంప్యూటర్ ఇంజినీరింగ్ (2014-18) లో చేరారు. నాలుగో ఏడాదిలోనే మైక్రోసాఫ్ట్ (బెంగళూరు) లో కొలువు సాధించారు. వారాంతపు సెలవు దినాల్లో మొక్కలు నాటడం, వృద్ధాశ్రమాలు సందర్శించడం, ఉద్యోగం చేస్తూనే ఏడాది పాటు సివిల్స్ శిక్షణ తీసుకున్నారు.
ఎంచుకున్న లక్ష్యంపై దృష్టి - మొక్కవోని దీక్షతో సివిల్స్‌లో విజయం - AP CANDIDATES IN UPSC CIVILS
తొలి ప్రయత్నాలు విఫలమైనా : మొదటి మూడు ప్రయత్నాల్లో విఫలమైనా కుంగిపోలేదు. సొంతంగా సాధన చేస్తూనే ఆన్లైన్లో మాక్‌టెస్ట్‌లు రాయడం, గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగింది. సివిల్స్‌లో అడిగే ప్రశ్నలకు కొత్తదనంగా, సమగ్ర సమాచారాన్ని జోడించి జవాబులు ఏ విధంగా రాయాలో నేర్చుకొని నాలుగో ప్రయత్నంలో సఫలమయ్యారు.
ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఇలా : 20 నిమిషాల ఇంటర్వ్యూ సమయంలో అతి క్లిష్టమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు. లక్షలు వచ్చే కొలువును వదిలి సివిల్ సర్వీసెస్‌కు ఎందుకు వచ్చావని, ఏపీ విభజనతో వచ్చే లాభ నష్టాలు వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చిందని మౌనిక పేర్కొన్నారు. ఇకపై ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా చెబుతున్నారు.