AP RAINS :వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో పలుచోట్ల జనజీవనం స్తంభించింది. విశాఖపట్నం, కాకినాడ సముద్రపు తీరాల్లో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద అలలు షాప్‌లను తాకుతున్నాయి. వర్షానికి పెదగంట్యాడ మండలం కొంగపాలెంలో రేకుల షెడ్డు కూలడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రాకాసి అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు నేల కూలాయి. అంతర్వేది తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. గోదావరి సంగమం వద్ద అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. పల్లిపాలెంలో అలలు ఇళ్లను, బీచ్ రోడ్డును ముంచెత్తాయి. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి. ఓఎన్‌జీసీ ప్లాంటును సముద్రపు నీరు తాకింది. ఆక్వా చెరువులను సముద్రం నీరు ముంచెత్తింది.
నెల్లూరుకు వాయు'గండం' - నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
తడ వద్ద తీరం దాటిన వాయుగుండం: తిరుపతి జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా 22 కి.మీ వేగంతో కదిలి తీరాన్ని తాకింది. ప్రస్తుతం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు తీర ప్రాంత, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
జలాశయాలకు చేరుతున్న వరద:శ్రీసత్యసాయి జిల్లా వెల్దుర్తి సమీపంలో చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీని ప్రభావంతో వెల్దుర్తి, గంగినేపల్లి తండాలకు, ఎర్రోనిపల్లి, బ్రాహ్మణపల్లి, చిన్నప్పరెడ్డిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వైఎస్సార్ జిల్లాలో గండికోట జలాశయం, మైలవరం జలాశయాలకు వరద వచ్చి చేరతోంది. భారీగా వచ్చి చేరుతున్న వరదతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. పైడిపాలెం, వామికొండ, సర్వారాయ సాగర్ జలాశయాలకు వరద వచ్చి చేరుతోంది. నెల్లూరు నగర శివారులోని ఆటోనగర్, చంద్రబాబు నగర్, తల్పగిరి కాలనీ, జొన్నవాడ రోడ్డు, పొట్టేపాలెం కలుజు ప్రాంతాల్లో వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం రాత్రి వర్షానికి పంట తడిసింది. ఆరబోసిన మొక్కజొన్న, వేరు శనగ తడిసి రైతులకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల వరి నీటమునిగింది.
తీరం దాటిన వాయుగుండం - ఆ జిల్లాలకు పొంచి ఉన్న ప్రమాదం
సీఎం చంద్రబాబు సమీక్ష:ఏపీలో భారీవర్షాలపై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు సీఎంకి వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడ్డాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను అధికారులు సీఎంకి వివరించారు.
ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావం:కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంపై వాయుగుండం ప్రభావం కనిపిస్తోంది. 24 గంటలుగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు వేగంగా గ్రామాలపై విరుచుకుపడుతున్నాయి. అలల దాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు, గృహాలు నేలకూలాయి. ఉప్పాడ, సుబ్బంపేట, మాయాపట్నం, జగ్గరాజుపేట గ్రామాలపై కెరటాల తాకిడి తీవ్రంగా ఉంది. రోడ్లు కోతకు గురై సముద్ర గర్భంలో కలిసిపోయాయి. గృహాలు కోల్పోయిన బాధితులు సామాగ్రితో పరాయి పంచకు చేరారు. తీరంలో సముద్రం ఇంతగా అలజడి సృష్టిస్తున్న అధికారులు కనీసం పట్టించుకోవడం తీరప్రాంత వాసులు వాపోతున్నారు. రాత్రి నుంచి విద్యుత్ లేక ఆహారం లేక పస్తులుండి బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించామని కనీసం సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
దంచికొడుతున్న వానలు- జలదిగ్భంధంలో రహదారులు