AP Police Constable Recruitment on December 30 To February 1st :కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వంలో నిలిచిన పోలీసు కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు పోలీసు రిక్రూట్ మెంట్ ఛైర్మన్ రవి ప్రకాష్ తెలిపారు. అర్హులైన అభ్యర్ధులకు ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్ టెస్ట్లు నిర్వహిస్తామని వెల్లడించారు. అభ్యర్ధులు ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కాల్ లెటర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఫిజికల్ టెస్ట్ కు హాజరయ్యే అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్ సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్ లోడ్ చేసుకోవాలని రవిప్రకాష్ తెలిపారు.
ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మంది అర్హత :వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోకానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అనంతరం జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ ఆ వెంటనే రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాలి. గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తామంటూ మొదట షెడ్యూల్ విడుదల చేసి హాల్‌టికెట్లూ జారీ చేశారు. చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో దానిని వాయిదా వేశారు.