AP High Court Fire On Lands Dispute Case :భూ యజమానులకు తెలీకుండా, నోటీసు ఇచ్చి వారి వాదనలు వినకుండా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రికార్డుల్లో మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ప్రభావిత వ్యక్తికి(ఎఫెక్టెడ్ పార్టీ) నోటీసులు ఇచ్చి, వాదనలు విన్న తర్వాత మాత్రమే ప్రక్రియ చేపట్టాలని తేల్చిచెప్పింది. నిబంధనలను పాటించకుండా రికార్డుల్లో మార్పులు చేయడం సరికాదంది. ఇష్టానుసారంగా రికార్డులు మార్చడం 'చిన్నం పాండురంగం' కేసులో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని ప్రకటించింది.
Land Re Survey in AP :నెల్లూరు జిల్లా పరికోట గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములను 'ప్రభుత్వ భూములుగా' పేర్కొంటూ రికార్డుల్లో మార్పులు చేస్తూ కలిగిరి మండల తహశీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేసింది. వారి భూముల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. మరోవైపు తమకు చెందిన భూములను మూడోపక్షానికి అనుకూలంగా రికార్డులను మార్చారంటూ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన పి. సత్య నాగేంద్రప్రసాద్ దాఖలు చేసిన వ్యాజ్యంలో పూర్తి వివరాలు సమర్పించాలని సహాయ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. వేసవి సెలవుల తర్వాత తదుపరి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి ఈమేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. భూ యజమానులకు సమాచారం లేకుండా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయడం, ఈ వ్యవహారంపై హైకోర్టులో తరచూ వ్యాజ్యాలు దాఖలు కావడంపై న్యాయమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు.
భూముల రీ సర్వేలో గందరగోళం.. సమస్యలను పరిష్కరించడంలో ఉన్నతాధికారుల ఉదాసీనం
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం, పరికోట గ్రామం సర్వే నంబరు 227/1, 227/2లో తమ పేరున ఉన్న భూములను 'భూముల సమగ్ర రీసర్వే' ముసుగులో ప్రభుత్వ భూములుగా మార్చారని పేర్కొంటూ కోట మహేశ్వరరెడ్డి, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. 1961 నుంచి ఆరు ఎకరాలకుపైగా భూమి తమ స్వాధీనంలో ఉందన్నారు. రెవెన్యూ రీకార్డుల్లో ఈ విషయం నమోదైందన్నారు. సమగ్ర రీసర్వే నిర్వహించాక అడంగల్ రిపోర్టులో 'ప్రభుత్వ భూమి'గా మార్చారన్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఆర్‌ఓఆర్-1బిలో ఆ భూములకు పిటిషనర్లు యజమానులుగా కనిపిస్తున్నారని గుర్తు చేశారు. అడంగల్‌లో మాత్రం ప్రభుత్వ ఆస్తిగా చూపారన్నారు. ఇది ఏ విధంగా సాధ్యమని సహాయ ప్రభుత్వ న్యాయవాదిని (ఏజీపీ) ప్రశ్నించారు. ఏ ఆధారంగా మార్చారో చెప్పాలన్నారు. ఏజీపీ తనకు తెలీదని సమాధానం ఇచ్చారు. వివరాలు సమర్పించేందుకు సమయం కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ కోర్టు ముందున్న ఆధారాలను పరిశీలిస్తే నిబంధనలను పాటించకుండా అధికారులు అడంగల్‌లో మార్పులు చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. తహశీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేశారు.
మూడు ఎకరాల భూవివాదం కేసులో 108 ఏళ్లకు తీర్పు.. మధ్యలో ఎన్నో ట్విస్టులు!
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో తనకు చెందిన 72సెంట్ల స్థలాన్ని ఆర్‌ఓఆర్‌లో (రికార్డ్ ఆఫ్ రైట్స్) ఓ వ్యక్తి పేరుపై మార్చడాన్ని సవాలు చేస్తూ పి.సత్య నాగేంద్రప్రసాద్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, వాదనలు చెప్పుకునే అవకాశం కల్పించకుండా ఆర్‌ఓఆర్‌లో మరో వ్యక్తి పేరును చేర్చారన్నారు. ఏపీ పట్టాదార్ పాస్‌పుస్తకం చట్ట నిబంధనలకు విరుద్దంగా రెవెన్యూ అధికారులు వ్యవహరించారన్నారు. తనపేరును తక్షణం మళ్లీ రికార్డుల్లో చేర్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి ప్రభావిత వ్యక్తి వాదన వినకుండా ఏ విధంగా రికార్డులను మారుస్తారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఏజీపీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపకూడదు: హైకోర్టు