AP Govt Stubborn in Giving Posting to IPS AB Venkateswara Rao:సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిపట్టుదలతో వ్యవహరిస్తోంది. రోజుల నుంచి గంటల వ్యవధిలోకి తన ఉద్యోగ విరమణ సమయం చేరుకుంది. ఆఖరి రోజైనా పోలీసు యూనిఫాం వేసుకునే అవకాశం కల్పించే అంశంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏబీవీపై పగబట్టింది. అతని సస్పెన్షన్ చెల్లదని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల నిలుపుదల కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా ఏబీవీకే ఊరట లభించింది. క్యాట్ ఉత్తర్వుల నిలపుదలను హైకోర్టు నిరాకరిస్తూ తీర్పు ఇచ్చింది.
వెంటనే సచివాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డిని కలిసి కోర్టు ఆదేశాల ప్రతిని అందజేసిన ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ఉత్తర్వుల మేరకు తనకు పోస్టింగ్ ఇచ్చే అంశంపై త్వరితగతిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి కూడా హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని ఇచ్చారు. పదవీ విరమణ చివరి గడియల్లో అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏబీవీకి పోస్టింగ్ ఇస్తుందా లేక నియామక ఉత్తర్వులు ఇవ్వకుండానే సాగనంపుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏ ఉద్యోగికి లేదా అధికారికి చిన్నపాటి ఇబ్బంది కలిగినా గొంతెత్తే నిరసన గళం వినిపించే సంఘాలు సైతం ఏబీవీకి సంఘీభావం ప్రకటించిన పాపాన పోలేదు.
డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను క్యాట్ ఎత్తివేసింది. రెండోసారి సస్పెన్షన్ చట్టవిరుద్ధమని క్యాట్ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడాన్ని తప్పుపడుతూ వెంటనే ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది. సస్పెన్షన్ కాలంలో జీతభత్యాలు చెల్లించాలని స్పష్టం చేసింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సీఎం జగన్ ఏబీ విషయంలో వ్యతిరేక భావనతోనే ఉన్నారు. అతన్ని డిస్మిస్ చేయడం కుదరదని కేంద్రం, యూపీఎస్సీ తేల్చిచెప్పినా లెక్కచేయకుండా, వాటి సిఫారసులను సైతం పెడచెవిన పెట్టారు.
రాజధాని సామగ్రి తరలింపును అడ్డుకున్న సీఆర్డీఏ - గుత్తేదారు సంస్థకు నోటీసులు - CRDA Blocked Material Moving
జగన్ కక్ష సాధింపులు:ఏబీ వెంకటేశ్వరరావు 1989లో యూపీఎస్సీ ద్వారా ఐపీఎస్‌కు ఎంపికై ఏపీ కేడర్‌కు అలాట్ అయ్యారు. మూడు దశాబ్దాలపాటు పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 ఎన్నికల సమయంలో అతనిపై వైఎస్సార్సీపీ నేతలు పదే పదే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసి ఆ పదవి నుంచి తప్పించేలా చేశారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ఏబీవీపై కక్ష సాధింపులు మొదలుపెట్టారు. నిఘా చీఫ్‌గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి కీలక పరికరాలు కొనుగోలు చేశారని, తమ ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఆ తర్వాత పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారంటూ విచారణ పేరుతో వేధించింది. తాను ఎలాంటి అవినీతీ చేయలేదని, అసలు పరికరాలే కొనుగోలు చేయలేదంటూ ఏబీవీ ఇచ్చిన వివరణను కనీసం పట్టించుకోలేదు. దీంతో ఆయన పరిపాలనా ట్రైబ్యునల్, న్యాయస్థానాలను ఆశ్రయించడంతో సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. అనంతరం ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా నియమితులయ్యారు. కానీ పోస్టింగ్ ఇచ్చిన రెండు వారాలకే మరో అభియోగంపై సర్కారు సస్పెండ్ చేసింది. తర్వాత వెంకటేశ్వరరావు తీవ్రమైన తప్పు చేశారంటూ అతన్ని సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 2020 డిసెంబరు 18న ఆయనపై విచారణ ప్రారంభించి 2022 అక్టోబరు 21నాటికి పూర్తి చేశామని లభించిన ఆధారాల మేరకు డిస్మిస్ చేయాలని విజ్ఞప్తి చేసింది.
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట - ప్రభుత్వ అప్పీల్ కొట్టివేత - BIG RELIEF TO AB VENKATESWAR RAO
కేంద్రానికి వివరాలు ఇవ్వని ప్రభుత్వం: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధారాల ప్రకారం డిస్మిస్ చేయడం కుదరదంటూ కేంద్ర హోం శాఖ తిరస్కరించింది. అయినా వెనక్కి తగ్గని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త ఆధారాలు దొరికాయంటూ అతన్ని డిస్మిస్ చేయాలని మళ్లీ కోరడంతో హోం శాఖ, యూపీఎస్సీకి నివేదించింది. ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన యూపీఎస్సీ ఏ రూల్ కింద డీజీ ర్యాంకు అధికారిని డిస్మిస్ చేయాలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి చేసిన తప్పేంటో, దానిపై విచారణలో తేలింది ఏమిటో ఆయన సమాధానం ఏమిటో ఎక్కడా లేదని స్పష్టం చేసింది.
అభియోగాలు ఎదుర్కొన్న అధికారి నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా, సముచిత ఆధారాల్లేకుండా డిస్మిస్ చేయడం సాధ్యం కాదని యూపీఎస్సీ కేంద్రానికి తేల్చిచెప్పింది. దీంతో రాష్ట్రం వినతిని యూపీఎస్సీ తిరస్కరించిందని అఖిల భారత సర్వీసుల నిబంధనల ప్రకారమే ఆయనపై చర్యలు తీసుకోవాలన్న తన మొదటి సిఫారసును అమలు చేయాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేగాక ఏం చర్యలు తీసుకున్నారో తమకు తెలియజేయాలని పేర్కొంది. ఏబీవీపై తీసుకున్న చర్యల వివరాలను పంపాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. స్పందన లేకపోవడంతో కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి మరో లేఖ రాశారు. ఏబీవీపై చర్యల వివరాలు ఇంకా తమకు అందలేదని వాటికోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
ఉత్తర్వుల నిలుపుదల నిరాకరణ: కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌లో ఏబీ కేసుపై విచారణ జరిగింది. తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఒకే కారణంతో ఏబీ వెంకటేశ్వరరావును రెండు సార్లు సస్పెండ్ చేశారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్ తీర్పు రిజర్వు చేసి ఈ నెల 8వ తేదీన తన నిర్ణయాన్ని వెల్లడించింది. క్యాట్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో వాజ్యం దాఖలు చేశారు. క్యాట్ ఉత్తర్వులు సరైనవేనని ఏబీవీ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు తన వాదనలు వినిపించారు. క్యాట్ ఉత్తర్వుల్లో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఒకే అభియోగంపై రెండు సార్లు సస్పెన్షన్ చెల్లదని పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు అనంతరం న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం క్యాట్ ఉత్తర్వుల నిలుపుదలను నిరాకరించింది.
కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే అరెస్ట్ : సీఈఓ మీనా - CEO Inspected Vote Counting Center
నోరెత్తని ఐపీఎస్‌ల సంఘం: రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగానే ఏబీవీ పట్ల వ్యవహరిస్తోందని ఇప్పటికే సామాజిక మాద్యమాల వేదికగా తీవ్రవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. జస్టిస్ ఫర్ ఏబీవీ అంటూ ఛేంజ్ ఓఆర్‌జీలో ప్రారంభమైన సంతకాల సేకరణకు రికార్డు స్థాయి స్పందన లభిస్తోంది. #Justice for ABV పేరిట పౌరసమాజం ఉద్యమిస్తోంది. మరికొన్ని సంస్థలు సైతం ఏబీవీకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలంటూ తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారుల సంఘం నుంచి ఎలాంటి స్పందన లభించడంలేదు.
ఏబీవీ హైకోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రతిని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలోను సమర్పించారు. మరికొన్ని గంటల్లో ఏబీవీ పదవీ కాలం ముగియనున్న వేళ- పోస్టింగ్ విషయంలో ఎలాంటి నిర్ణయం వస్తుందో అని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. కాదు కూడదు అనుకుంటే పగబట్టిన రాష్ట్ర ప్రభుత్వ బాటలోనే ఉన్నతాధికారులు వ్యవహరించి పోస్టింగ్ ఇవ్వకుండానే పదవీ విరమణ చేయిస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా ఉంది. పోస్టింగ్‌లో జాప్యం దురుద్దేశపూరితంగానే ఉందనే అభిప్రాయం పౌరసమాజం నుంచి వ్యక్తమవుతోంది.