AP GOVT ABHAYAM PROJECT FOR WOMEN SAFETY: ప్రజా రవాణా వాహనాల్లో మహిళల భద్రతకు పెద్దపీట వేసేలా కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆటోలు, టాక్సీలు, బస్సులు ఇతర రవాణా వాహనాల్లో మహిళలపై జరుగుతోన్న ఆఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేలా చేపట్టిన అభయం ప్రాజెక్టు పునరుద్దరణకు చర్యలు తీసుకుంటోంది. గత వైఎస్సార్సీపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యంతో పడకేసిన అభయం ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోసి, మహిళలకు ప్రయాణాల్లో పూర్తి భద్రత కల్పించాలని సంకల్పించింది. అతి త్వరలోనే అభయం ప్రాజెక్టు పనులను ప్రారంభించి పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించే మహిళల రక్షణ కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహత్తర కార్యక్రమం అభయం. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పరికరాన్ని ఆటోలు, టాక్సీలు, ఇతర ప్రజా రవాణా వాహనాల్లో ఏర్పాటు చేస్తారు. ఏదైనా ఆపత్కాల పరిస్ధితుల్లో పరికరంపై ఏర్పాటు చేసిన బటన్ను నొక్కితే, నిమిషాల వ్యవధిలో పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి బాధితులను రక్షించాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యం. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుతోన్న పరిస్ధితుల్లో వీటిని నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ఆ పథకాన్ని తీసుకువచ్చింది.
ఆహార భద్రతపై కీలక ఒప్పందాలు- రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు
ఉచితంగా అన్ని వాహనాల్లో ఏర్పాటు: అన్ని రాష్ట్రాల్లోని ప్రజా రవాణా వాహనాల్లో తప్పని సరిగా అభయం పరికరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మహిళల భధ్రతకు సంబంధించిన ప్రాజెక్టు కావడంతో పలు రాష్ట్రాలు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాయి. కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా తమ వంతు వాటా నిధులు భరించి కేవలం రెండేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాయి. చెన్నై, బెంగళూరు, దిల్లీ తదితర నగరాల్లో ఈ తరహా ప్రాజెక్టు వేగంగా పూర్తి చేశారు. అభయం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు అయ్యే వ్యయంలో 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా భరించాలని నిబంధన పెట్టింది. వాహన యజమానికి నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా అన్ని వాహనాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న 20 లక్షల పైగా ప్రజారవాణా వాహనాల్లో దశల వారీగా పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ప్రతి ప్రజా రవాణా వాహనంలోనూ అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే పరికరాన్ని డ్రైవర్ వెనక అమర్చుతారు. కమాండ్ కంట్రోల్ రూంలు నిర్మాణం సహా సిబ్బంది నియామకం, పర్యవేక్షణ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వీటన్నింటి ఏర్పాటునకు 266 కోట్ల 36 లక్షల వ్యయమవుతుందని అధికారులు ప్రతిపాదనలు పంపారు. కేంద్ర ప్రభుత్వం వాటాగా 153 కోట్ల 66 లక్షలు కాగా, వీటిలో 84 కోట్ల 61 లక్షలను ఇప్పటికే విడుదల చేసింది. రాష్ట్ర వాటాగా 123 కోట్ల 15 లక్షలు కాగా, నాలుగేళ్లలో కేవలం 4 కోట్లు 44 లక్షలు మాత్రమే విదిల్చింది. ఇంకా 118 కోట్ల 71 లక్షలు విడుదల చేయాల్సి ఉండగా, గత వైఎస్సార్సీపీ సర్కారు ఈ ప్రాజెక్టుపై అలవి మానిన నిర్లక్ష్యం ప్రదర్శించింది.
పరిశ్రమల్లో భద్రతా చర్యలు - ప్రమాదాల నివారణ దిశగా కూటమి సర్కారు చర్యలు - industries safety measures
పరికరాల సరఫరాను నిలిపివేసిన కాంట్రాక్టర్: కేవలం ఒకసారి సమావేశం నిర్వహించి ఆర్భాటంగా పథకాన్ని ప్రారంభించారు. విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, విజయవాడ, కాకినాడ, అనకాపల్లి నగరాల్లో కొన్ని ఆటోల్లో మాత్రమే పరికరాలు ఏర్పాటు చేసిన జగన్ సర్కారు, ఆ తర్వాత ప్రాజెక్టుకు నిధులును ఆపేసింది. దీంతో పరికరాల సరఫరాను కాంట్రాక్టర్ నిలిపివేశారు. అన్ని ప్రజా రవాణా వాహనాల్లో పరికరాలు ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పిన అప్పటి సీఎం జగన్, రాష్ట్ర రవాణాశాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వం ఎన్నో సార్లు విన్నవించినా ప్రాజెక్టు కోసం అదనంగా చిల్లి గవ్వ కూడా విదల్చ లేదు. దీంతో ఎంతో ప్రాధాన్యత కల్గిన ముఖ్యమైన ప్రాజెక్టు ఎందుకూ పనికిరాకుండా మరుగున పడింది.