ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో 'స్వమిత్వ పథకం' రీ స్టార్ట్ - పది లక్షల ఆస్తుల సర్వేకు ప్లాన్ - SVAMITVA SCHEME IN AP

గ్రామ కంఠాల్లో ఆస్తులకు యాజమాన్య హక్కులతో ధ్రువపత్రాలు - మే నెలాఖరులోగా 10 లక్షల ఆస్తులను సర్వే చేసేందుకు ప్రణాళికలు

Svamitva Scheme
Svamitva Scheme (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 8:59 AM IST

Svamitva Scheme in AP :గ్రామ కంఠాల్లోని ఇండ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. మే నెలాఖరుకల్లా 10 లక్షల ఆస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పూర్తిచేసి, యాజమాన్య హక్కు పత్రాలు అందజేయాలని సర్కార్ భావిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకానికి నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసింది. కోటికిపైగా ఆస్తులుంటే ఐదేళ్లలో ఐదు లక్షలకే యాజమాన్య హక్కులను నిర్ధారించారు. అందులోనూ 3 లక్షలు మాత్రమే ధ్రువపత్రాలు (ప్రాపర్టీ కార్డులు) పంపిణీ చేశారు.

సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం ముందే ఈ పథకం పనులు నిలిచిపోయాయి. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం మిగిలిన గ్రామాల్లో సర్వే పూర్తిచేసి వచ్చే మూడేళ్లలో ఇళ్లు, స్థలాలు, ఇతర ఆస్తులపై ప్రజలకు హక్కులు కల్పించేలా కార్యాచరణ రూపొందించింది. ఈ విభాగానికి ప్రత్యేక అధికారిని నియమించింది.

సీఎం ఫొటోకు బదులు ప్రభుత్వ లోగో :గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలను ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్‌ చేసే హక్కు ఇప్పటికీ లేదు. స్వమిత్వ పథకంలో ఇచ్చే యాజమాన్య హక్కు పత్రాలతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. దీనికోసం సర్కార్ చట్ట సవరణ చేయనుంది. కీలకమైన ఇలాంటి పథకానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులివ్వకుండా తూట్లు పొడిచింది. 17,554 రెవెన్యూ గ్రామాల్లో కోటికిపైగా గ్రామకంఠం ఆస్తులుంటే గత ఐదు సంవత్సరాల్లో 1410 గ్రామాల్లో 5 లక్షల ఆస్తులను మాత్రమే డ్రోన్‌ చిత్రాల ద్వారా సర్వే చేశారు.

వీటికి సంబంధించి ముద్రించిన మూడు లక్షల ధ్రువపత్రాల్లో అప్పటి సీఎం జగన్‌ ఫొటో ఉండడంపై విమర్శలు వచ్చాయి. వాటిని పట్టించుకోకుండా ప్రజలకు పంపిణీ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో మరో రెండు లక్షల కార్డుల ముద్రణ నిలిచింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కార్డు డిజైన్‌ను మార్చనుంది. వాటిపై సీఎం ఫొటోకు బదులు ప్రభుత్వ లోగో ముద్రించాలని నిర్ణయించింది. మిగిలిన గ్రామాల్లో దశల వారీగా సర్వే పూర్తి చేయనుంది.

పంచాయతీల ఆస్తులపై స్పష్టత : సర్వేతో పంచాయతీలకు సంబంధించిన ఆస్తుల విషయంలోనూ స్పష్టత రానుంది. గ్రామాల్లో భవనాలు, కాలువలు, రోడ్లు, చెరువులు, ఖాళీ స్థలాలను సర్వేలో గుర్తించి హక్కులు నిర్ధారించనున్నారు. 5000ల పంచాయతీల్లో స్థలాలు, చెరువులు సైతం ఆక్రమణల్లో ఉన్నట్లు అంచనా. కొన్ని భవనాలను అక్కడి పెద్దలు గుప్పిట్లో పెట్టుకుని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. పలు ఆస్తులకు సంబంధించిన లీజులు, అద్దెలు కూడా స్వాహా చేస్తున్నారు. సర్వేలో ఇలాంటి వాటిని గుర్తించి పంచాయతీలకు అప్పగించనున్నారు. కోర్టు కేసులుంటే వాటిని తాత్కాలికంగా పక్కన పెడతారు.

జగన్‌ ఫొటో ఉన్న కార్డుల మాటేమిటి? : గత సర్కార్​లో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ ఫొటోతో ముద్రించి ప్రజలకు పంపిణీ చేసిన ధ్రువపత్రాల (ప్రోపర్టీ కార్డులు) విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. వాటిని వెనక్కి తీసుకొని కొత్త డిజైన్‌ ప్రకారం ముద్రించే కార్డులు ఇవ్వాలా? వాటినే కొనసాగించాలా? అనే విషయంలో ప్రభుత్వ ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ప్రజల్లో అత్యధికులు వాటిని వెనక్కి ఇచ్చేందుకే ఆసక్తి చూపుతున్నారు. తమ ఆస్తుల కార్డుపై జగన్‌ ఫొటో ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భూముల రీసర్వేలో మార్పులు - యజమాని రాకుంటే వీడియోకాల్‌

నిషేధిత భూములపై మంత్రివర్గ ఉపసంఘం - కేబినెట్ నిర్ణయాలివే

ABOUT THE AUTHOR

...view details