AP Government Orders on Self Certification Scheme: సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే ఇక నుంచి అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలు ఇచ్చింది. సీఆర్డీఏ మినహా అన్ని చోట్లా అనుమతుల జారీ అధికారం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది.
300 చదరపు మీటర్లు మించకుండా ఉన్న ప్రాంతాల్లో నిర్మాణాలను స్వయంగా యజమానులే ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసేలా చట్టంలో మార్పులు చేశారు. స్వయంగా యజమానులు లేదా ఆర్కిటెక్టు, ఇంజనీర్లు, టౌన్‌ప్లానర్లు కూడా దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు కూడా ఇంటి ప్లాన్ను ధ్రువీకరించి అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా: బహుళ అంతస్తులు కాని నివాస భవనాలకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తూ మార్గదర్శకాలు ఇచ్చింది. ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టంలో నేరుగా దరఖాస్తుదారు లైసెన్సుడు టెక్నికల్ పర్సన్ జారీ చేసిన ప్లాన్ను అప్లోడ్ చేసేలా నిబంధనల్ని సరళతరం చేసింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్, టౌన్ ప్లానింగ్ చట్టాల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు గానూ భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ ఆదేశాలిచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా భవన నిర్మాణ అనుమతుల కోసం సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టారు.