Chandrababu on BC Welfare : తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కల్పించాలని సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరగనుండగా ఈ భేటీలోనే సంబంధిత దస్త్రానికి ఆమోదముద్ర వేయనున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి నివేదిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
సచివాలయంలో బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమశాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 2014-19 మధ్య అమలైన ఎన్టీఆర్ విదేశీవిద్య, విద్యోన్నతి పథకాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎక్కువగా లబ్ధి చేకూరేలా పథక నిబంధనల్లో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. 26 జిల్లాల్లో బీసీ భవన్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బీసీ స్టడీ సర్కిళ్ల బలోపేతానికి రూ.10 కోట్లు విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశాలిచ్చారు.
Chandrababu on BC reservations :అలాగే 56 బీసీ కార్పొరేషన్లు పునర్ వ్యవస్థీకరించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అలాగే జాతీయ వెనుకబడి తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ నుంచి బీసీలకు వందకోట్ల మేర రాయితీ రుణాలు అందించేందుకు అవసరమైన రాష్ట్ర వాటా రూ.38 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. గురుకుల విద్యార్థులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.110 కోట్ల డైట్ ఛార్జీలు, రూ.20.52 కోట్ల కాస్మోటిక్ ఛార్జీల బకాయిలను చెల్లించాలన్నారు.
68 కాపు భవనాల పూర్తికి ప్రణాళిక :వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులకు పది కోట్లు, విద్యార్థుల సామగ్రికి రూ.25 కోట్లు, ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాల మంజూరుకు రాష్ట్రవాటా 89.18 కోట్లు వెంటనే విడుదల చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలిచ్చారు. చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోని బీసీ భవన్‌ల పూర్తికి రూ.8 కోట్లు విడుదల చేయాలని సూచించారు. బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని వివరించారు. ఆర్థికంగా వెనకబడిన ఇతర వర్గాల్లో కుటుంబాలను గుర్తించి వారి అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. 2014-19 మధ్య ప్రభుత్వ హయాంలో మంజూరుచేసిన 68 కాపు భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు.
ఆర్టీజీఎస్‌తో గురుకులాల అనుసంధానం : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకులాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఆర్టీజీఎస్‌తో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించినట్లు సంక్షేమశాఖ మంత్రి సవిత వెల్లడించారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. బీసీ-ఏ లోని అత్యంత వెనుకబడిన వర్గాల వారిని ఆదుకునేందుకు సీడ్ అనే పథకాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు. చేతివృత్తుల వారికి కేంద్రప్రభుత్వ పథకమైన పీఎం విశ్వకర్మ వర్తింపజేస్తామని సవిత పేర్కొన్నారు.
బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత చంద్రబాబుదైతే.. తగ్గించిన ఘనత జగన్‌దే: లోకేశ్
పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ - నీళ్లు, వీధిదీపాలు, పారిశుద్ధ్యం పనులు వేగవంతం - Panchayati Raj Funds Released in AP