ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధి, సంక్షేమాల కలబోత - ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులూదేలా బడ్జెట్‌

భవిష్యత్​పై ఆశలు చిగురింపజేస్తూ సాగిన బడ్జెట్‌ రూపకల్పన

AP Budget 2024
AP Budget 2024 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2024, 9:05 AM IST

AP Budget 2024: గతి తప్పిన రాష్ట్రానికి రాచబాట చూపిస్తూ సంక్షేమం - అభివృద్ధి రెండు కళ్లుగా అడుగులు వేస్తూ నేల విడిచి సాము చేయకుండా వాస్తవిక పద్దును కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొచ్చింది . సంక్షేమానికి, ప్రాధాన్య రంగాలకు అగ్రతాంబూలం వేస్తూనే బడ్జెట్‌కు ప్రాణాధారమైన మూలధన వ్యయాన్ని అమాంతం పెంచింది. ప్రజల ఆశలు - ఆకాంక్షలను తీరుస్తూనే పదింతల ప్రగతి సాధించాలనే సమున్నత సంకల్పంతో ఏపీ పునర్ నిర్మాణమే ధ్యేయంగా రూ.3 లక్షల కోట్లకు చేరువగా ప్రతిపాదించిన బడ్జెట్‌ నవ్యాంధ్ర భవిష్యత్​కి, స్వర్ణాంధ్ర స్వప్నం సాకారానికి పటిష్ట పునాదులు వేసేలా ఉంది.

ఐదేళ్ల దుష్ట పాలనతో ఆర్థికం అస్తవ్యస్తమైన వేళ చరిత్ర ఎరుగని విధంగా ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లను చూసింది నవ్యాంధ్ర! 2024 జూన్‌లో పాలనా పగ్గాలు స్వీకరించిన కూటమి ప్రభుత్వం అప్పులెన్ని ఉన్నాయో, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులేంటో తెలియని దీన స్థితి. ఈ పరిస్థితుల ప్రోద్బలంతో ఆర్డినెన్స్ ద్వారా రెండోసారి ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్ పెట్టక తప్పలేదు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థికస్థితిని అర్థం చేసుకుని వ్యవస్థలను గాడిన పెట్టింది అప్పు పుట్టనిదే పూట గడవని స్థితి నుంచి సంపద సృష్టి దిశగా ఒక్కో అడుగు వేస్తూ 5 మాసాల పాలన పూర్తిచేసుకుంది.

AP Budget 2024 Highlights :రాష్ట్ర పునర్‌ నిర్మాణం, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులూదడమనే ద్విముఖ వ్యూహంతో 2024-25 బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఐదేళ్ల విధ్వంసంతో అప్పుల ఊబిలో చిక్కిన ఏపీని అభివృద్ధి వైపు నడిపించాలన్న అఖిలాంధ్ర ప్రజల అపూర్వమైన తీర్పును, అఖండ మెజార్టీని గౌరవించింది. ఈ వ్యవస్థ అవస్థలు తీరుస్తూ ఆర్థికానికి చికిత్స చేసి జవజీవాలు నింపే సదాశయంతో పక్కా లెక్కలతో పటిష్టమైన ప్రణాళికలతో 6 కోట్ల ఆంధ్రుల భవిష్యత్​ను బంగారుమయం చేసే సిసలైన కార్యాచరణతో భవిష్యత్​పై ఆశలు చిగురింపజేస్తూ, జనరంజకంగా బడ్జెట్‌ను తీర్చిదిద్దింది.

కీలక రంగాలకు మేలిమి కేటాయింపులతో ప్రభుత్వ లక్ష్యాలను ప్రతిబింబించింది వార్షిక బడ్జెట్‌. జగన్‌ జమానాలో ఈశాన్య రాష్ట్రాల కంటే తీసికట్టుగా ఉండిపోయిన మూలధన వ్యయాన్ని అమాంతం పెంచింది ఎన్డీయే సర్కార్‌! ప్రగతి పరుగులో ముందున్న రాష్ట్రాల్ని అందుకోవాలన్న సత్ సంకల్పంతో రూ.32,000ల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించింది. అదే సమయంలో రూ.70,000ల కోట్ల కేటాయింపులతో బడ్జెట్‌పై సంక్షేమ సంతకం చేసింది.

భారీఎత్తున కేటాయింపులు :బడుగుజీవుల బలిమి కోసం, కర్షకుల కలిమి కోసం భారీఎత్తున కేటాయింపులను చూపింది. ప్రాధాన్య రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, యువత సైపుణ్యాలకు పదును పెట్టే సంకల్పాన్ని బలంగా చాటింది. ప్రాథమిక, ఉన్నత విద్యకు కలిపి రూ.32,000ల కోట్లకు కేటాయించి చిత్తశుద్ధి చాటుకుంది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా వైద్యానికి రూ.18,000ల కోట్లతో ప్రజారోగ్యానికి నిధుల భరోసా కల్పించింది.

ప్రాణాధారమైన జలవనరులకు పదహారన్నర వేల కోట్లకు పైగా పద్దును ప్రతిపాదించగా తొమ్మిదిన్నర వేల కోట్లతో రవాణా - రోడ్లుభవనాల విభాగానికి పెద్దపీట వేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సహా జనజీవితాలను బాగుచేసే రంగాలన్నింటికీ అవసరానికి మించి నిధులిచ్చేలా ప్రతిపాదనలు సమర్పించింది. బడ్జెట్‌లో అంతర్భాగమే అయినా రూ.43,402 కోట్ల భారీ మొత్తంతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రతిపాదించింది ప్రభుత్వం!

సూపర్‌-6 హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవకు కేటాయింపులు చేసింది. దీనికి పీఎం-కిసాన్‌ యోజన తోడ్పాటు ఉండనే ఉంది. సంక్షేమానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన తల్లికి వందనం పథకానికి రూ.6487 కోట్లు కేటాయించింది. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీ అమలుకు రూ.3341కోట్లు కేటాయించింది. ఇక మేలైన కేటాయింపులతో ఉద్యానం, మత్స్య రంగం, పాడి పరిశ్రమాభివృద్ధికి కంకణం కట్టుకుంది. పింఛను పెంపు, అన్న క్యాంటీన్లు, ఉచిత గ్యాస్‌, ఉచిత ఇసుకతో ప్రజలకు మెప్పిస్తున్న ప్రభుత్వం వీలైనంత త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యమూ కల్పిస్తామని మాటిచ్చింది.

అమరావతి, పోలవరానికి తగిన కేటాయింపులు :రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో ఇతోధికంగా నిధులిచ్చిన ప్రభుత్వం వడివడిగా పనులు సాగేందుకు బాటలు పరిచింది. కేంద్రం ఇస్తున్న రూ.15,000ల కోట్ల నిధుల గురించి ప్రస్తావించింది. నవ్యాంధ్ర జీవనాడైన పోలవరం ప్రాజెక్టుకు పెద్దఎత్తున నిధులు కేటాయించి తమ ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పింది. బీసీ సంక్షేమానికి అత్యధిక కేటాయింపులు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మళ్లీ స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసింది.

చెప్పుకోవడానికి వార్షిక బడ్జెటే అయినా ఇప్పటికే 8 మాసాల సమయం పూర్తయిన దశలో ఇప్పటిదాకా చేసిన ఖర్చులు, మిగిలిన 4 నెలలకు అవసరమైన ప్రతిపాదనలతో బడ్జెట్‌ వంటకం సిద్ధం చేసింది సర్కార్! మొత్తంగా విజన్ - 2047 లక్ష్యం దిశగా శరవేగంగా అడుగులు వేస్తూనే రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసే సంకల్పానికి కట్టుబాటు చాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.24,498 కోట్ల రుణభారం తగ్గించడానికి సంసిద్ధత తెలిపింది. సరళమైన పాలన - ప్రభావవంతమైన ప్రభుత్వం అన్నదే గీటురాయిగా సంక్షేమం - అభివృద్ధి రెండు కళ్లుగా స్వర్ణాంధ్ర కల సాకారానికి సంకల్పం చెప్పుకుంది.


రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ - శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌

రైతులకు గుడ్‌న్యూస్ - వ్యవసాయ రంగానికి రూ.43,402 కోట్ల కేటాయింపులు

ABOUT THE AUTHOR

...view details