Free Sand Policy in AP : ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇసుకను విక్రయించి చెల్లింపులను నగదు రూపంలో తీసుకుని పెద్దయెత్తున అక్రమాలకు పాల్పడింది. తాజాగా ఎన్డీయే సర్కార్ ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తం ఇది నేటి నుంచి అమలవుతున్న వేళ, సీనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
AP Sand Policy Updates : ఇందులోనూ ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తూ, పారదర్శక విధానం అమలు చేయనుంది. డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే 16 జిల్లాల్లో బ్యాంకు ఖాతాలు తెరవగా, వాటికి ఆయా బ్యాంకులు ఇవాళ క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం మినహా, మిగతా 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాల వద్ద నుంచి ఈ ఉచిత ఇసుక విధానం తొలుత అమలు కానుంది. ఏపీలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలున్నాయి, వాటిలో ఎంతమేర అందుబాటులో ఉంది, తదితర వివరాలన్నీ ఆదివారం నుంచే గనుల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అధికారులు అందుబాటులో ఉంచారు.
చేతిరాతతో వే బిల్లులు జారీ : విక్రయాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజుకు ఆ రోజు జరిగిన ఇసుక విక్రయాల వివరాలు, మిగిలిన నిల్వల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మార్పు చేయనున్నారు. నిల్వకేంద్రాల్లో ఇసుక ధర తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవాళ్టి నుంచి రెండు వారాల పాటు చేతిరాతతో వే బిల్లులు జారీ చేస్తారు. ఆ తర్వాత నుంచి వాటిని కూడా ఆన్‌లైన్‌లోనే జారీ చేసేలా సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్నారు.
ఇసుక పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం: మంత్రి కొల్లు రవీంద్ర - Free Sand Distribution
ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోదు. కేవలం నిర్వహణ ఖర్చులను మాత్రమే వసూలు చేస్తుంది. సీనరేజ్ కింద టన్నుకు రూ.88 తీసుకుంటారు. ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో బోట్స్‌మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక అయితే టన్నుకు రూ.225ల చొప్పున తీసుకుంటారు. రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే, రవాణాఖర్చు కింద టన్నుకు, కిలోమీటరుకు రూ.4.90 చొప్పున లెక్కిస్తారు. నిర్వహణ ఖర్చుకింద టన్నుకు రూ.20 తీసుకోనున్నారు.
నిర్వహణ ఖర్చు మాత్రమే వసూలు :ప్రభుత్వం సీనరేజ్ కింద వసూలు చేసే రూ.88లో జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతినెలా జమచేయనున్నారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు రూ.20ల చొప్పున తీసుకునే సొమ్మును, వేబిల్లుల కొనుగోలు, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు, మున్ముందు రీచ్‌లకు పర్యావరణ అనుమతుల కోసం ఫీజులు చెల్లించేందుకు వినియోగిస్తారు.
వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఎడ్లబండ్ల ద్వారా నేరుగా ఇసుక తవ్వి తీసుకెళ్లేలా వీలు కల్పించారు. సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలు, అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎడ్లబండ్ల ద్వారా మాన్యువల్‌గా తవ్వి ఇసుకను తరలించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు గుత్తేదారులు కొన్ని జిల్లాల్లో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్వి విక్రయాలు జరిపేవారు. ఇకపై ఇదంతా ఉచితంగానే తవ్వి తీసుకెళ్లవచ్చని గనులశాఖ అధికారులు పేర్కొన్నారు
Free Sand Distribution in AP : ఆనకట్టలు, జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వితీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి పర్యావరణ అనుమతులు అవసరం లేకపోయినా, కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్‌కి ఫీజులు చెల్లించి అనుమతి తీసుకోనున్నారు. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేయకుండా, నిల్వ కేంద్రాల నుంచి తీసుకున్నది అక్రమంగా విక్రయాలు జరపకుండా ప్రత్యేక కార్యదళం, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా నిఘా ఉంచనున్నారు.
అమల్లోకి రానున్న ఉచిత ఇసుక విధానం - మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం - Free Sand Distribution in AP